Share News

Justice Sudarshan Reddy: ఏ నిర్ణయం తీసుకున్నా.. నేను సిద్ధం

ABN , Publish Date - Sep 07 , 2025 | 09:23 PM

మరికొన్ని గంటల్లో ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఎలక్టోరల్ కాలేజీలోని ఎంపీలందరికీ ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి కీలక సూచన చేశారు.

Justice Sudarshan Reddy: ఏ నిర్ణయం తీసుకున్నా.. నేను సిద్ధం
Justice Sudarshan Reddy

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 07: ఉప రాష్ట్రపతి ఎన్నికకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఆదివారం నాడు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో దేశ హితం కోసం ఓటు వేయాలని ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. ఎంపీలు ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఈ ఎన్నికను కేవలం ఉప రాష్ట్రపతి ఎన్నికగా చూడొద్దని ఓటు హక్కు వినియోగించుకునే ఎంపీలకు ఆయన సూచించారు. ఇది దేశం కోసం జరిగే ఎన్నికగా భావించాలని వారికి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి వివరించారు. భారత్ ఆత్మ కోసం జరిగే ఎన్నికలుగా వీటిని భావించాలని.. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామంటూ ఎంపీలకు ఆయన కీలక సూచన చేశారు.


సెప్టెంబర్ 9వ తేదీ ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అదే రోజు సాయంత్రం ఈ ఎన్నికల ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలోని 786 ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే గతంలో జరిగిన ఎన్నికల్లో ఉప రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్ దన్‌ఖడ్ ఎన్నికయ్యారు. కానీ ఆ పదవికి ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేశారు.


అనారోగ్య కారణాల వల్లే తాను ఈ పదవికి రాజీనామా చేసినట్లు దన్‌ఖడ్ వివరణ ఇచ్చారు. దన్‌ఖడ్ వివరణపై ప్రతిపక్షలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. మరేదో కారణంగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారంటూ ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆరోపించారు.


ఇక ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేశారు. అలాగే ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ప్రతిపక్ష పార్టీలు బరిలో నిలిపాయి. ఎన్నికల వేళ.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల ఎంపీలను కలిసి.. తనకు ఓటు వేయాలని జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

దసరా మహోత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి..ఈసారి ప్రత్యేకత ఏంటంటే..?

మైలార్ దేవ్ పల్లిలో మళ్లీ అగ్ని ప్రమాదం

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 09:44 PM