Share News

Jharkhand: భూసేకరణ సెగలు.. మాజీ ముఖ్యమంత్రి గృహ నిర్బంధం

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:28 PM

గిరిజన సంస్థల నిరనసల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తు జాగ్రత్తగా చంపయి సోరెన్‌ను హౌస్ అరెస్టు చేసినట్టు రాంచీ సిటీ డీఎస్‌పీ కేవీ రామన్ తెలిపారు.

Jharkhand: భూసేకరణ సెగలు.. మాజీ ముఖ్యమంత్రి గృహ నిర్బంధం
Champai Soren

రాంచీ: ప్రభుత్వ ఆసుపత్రి కోసం భూసేకరణకు వ్యతిరేకంగా గిరిజన సంస్థలు నిరసనలకు పిలుపునివ్వడంతో జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ (Champai Soren)ను ఆదివారంనాడు గృహనిర్బంధం (House arrest)లో ఉంచారు. రాంచీకి వెళ్తుండగా మార్గమధ్యంలోనే చంపయి సోరెన్ కుమారుడు బాబూలాల్ సోరెన్, అతని మద్దతుదారులను కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు. గిరిజన సంస్థల నిరనసల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ముందస్తు జాగ్రత్తగా చంపయి సోరెన్‌ను హౌస్ అరెస్టు చేసినట్టు రాంచీ సిటీ డీఎస్‌పీ కేవీ రామన్ తెలిపారు.


రాంచీలో భారీ భద్రత

గిరిజన సంస్థల నిరసనలను దృష్టిలో ఉంచకుని రాంచీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వ్యూహాత్మక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనికి ముందు చంపయి సోరెన్ మీడియా సమావేశంలో జేఎంఎం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గిరిజను భూములను ప్రభుత్వం ఆక్రమించుకుంటోందని ఆరోపించారు. రాంచీ నగ్రీ ఏరియాలో రూ.1000 కోట్లతో రిమ్స్-2 ఆసుపత్రి కోసం బలవంతంగా గిరిజనుల భూములు లాక్కున్నారని, వారికి పరిహారం కానీ, భూములు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం కానీ జరగలేదని చెప్పారు. తాము ఆసుపత్రి ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదనీ, రాంచీలో నిరుపయోగంగా ఎన్నో ఎక్కరాల భూములున్నాయని, అక్కడ ఆసుపత్రి కట్టవచ్చని అన్నారు.


రాష్ట్రంలో గిరిజనులను టార్గెట్ చేస్తున్నారని, హక్కుల కోసం అడిగితే ప్రాణాలు తీస్తున్నారని చంపయి సోరెన్ ఆరోపించారు. పలుమార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్న సూర్య హన్స్డా‌ను అరెస్టు చేసి ఎన్‌కౌంటర్‌లో చంపేశారని, ఆయన గిరిజనుడు కావడమే ఇందుకు కారణమని ఆరోపించారు. 'ఈ భూమికి యజమానులమని మేము చెప్పుకుంటున్నాం. కానీ అసలైన చేదు నిజం ఏమిటంటే రేషన్ కార్డు మీద వచ్చే 5 కేజీల బియ్యంపై ఆధారపడి బతుకుతున్నాం. ఆ బియ్యం కోసం కూడా పడిగాపులు కాస్తున్నాం. ఈ పరిస్థితి మారాలి' అని మాజీ సీఎం అన్నారు.


ఇవి కూడా చదవండి..

ఓట్ల చోరీ జరగనీయం.. ఈసీని వదలం

రాహుల్‌కి ముద్దు పెట్టిన యువకుడు.. చితక్కొట్టిన సిబ్బంది

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 03:28 PM