Share News

Jaishankar Mocks Rahul : రాహుల్‌.. చైనా గురువు

ABN , Publish Date - Jul 31 , 2025 | 03:38 AM

విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ రాజ్యసభలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను

Jaishankar Mocks Rahul : రాహుల్‌.. చైనా గురువు

బీజింగ్‌ ఒలింపిక్స్‌కు వెళ్లి ఆ దేశం నుంచి పాఠాలు నేర్చుకున్నారు

  • అవి చాలక చైనా రాయబారితో ట్యూషన్లు

  • విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఎద్దేవా

  • రాజ్యసభ చర్చలో నెహ్రూ, కాంగ్రె్‌సపై ధ్వజం

న్యూఢిల్లీ, జూలై 30: విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ రాజ్యసభలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీని, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను చైనా గురువులుగా అభివర్ణించారు. దౌత్యవేత్తగా పనిచేసిన తనకు చైనా గురించి పెద్దగా తెలీదని.. రాహుల్‌, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం బీజింగ్‌ ఒలింపిక్స్‌కు వెళ్లి చైనా గురించి తెలుసుకున్నారని.. ఇక్కడి చైనా రాయబారి నుంచి ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పించుకున్నారని ఎద్దేవాచేశారు. తాను ఇటీవల ఆ దేశాన్ని సందర్శించినప్పుడు సదరు చైనా గురువుల్లా రహస్య భేటీలు జరుపడం గానీ, రహస్య ఒప్పందాలు కుదుర్చుకోవడం గానీ చేయలేదన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై బుధవారం రాజ్యసభలో చర్చ సందర్భంగా.. ప్రథమ ప్రధాని నెహ్రూ, గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై జైశంకర్‌ విరుచుకుపడ్డారు. ఏ దేశమైనా తనకు మేలు జరిగేలా, తన రాష్ట్రాలకు ఎక్కువ నీరు అందేలా ఒప్పందాలు చేసుకుంటుందని.. కానీ నెహ్రూ కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందంతో నీళ్లపై మనకు హక్కే లేకుండా చేశారని.. పాకిస్థాన్‌లోని పంజాబ్‌కు 80ు నీరివ్వడమే గాక ఆర్థిక సాయం కూడా అందించారని ధ్వజమెత్తారు. పాకిస్థాన్‌-చైనా బంధం గురించి రాహుల్‌ మాట్లాడుతున్నారని.. ఇది రాత్రికి రాత్రి ఏర్పడిన బంధం కాదని.. 1960ల నుంచే ఆ దేశాల నడుమ పరస్పర సహకారం ప్రారంభమైందన్నారు. తాను 41 ఏళ్లు దౌత్యవేత్తగా ఉన్నానని.. దీర్ఘకాలం చైనాలో రాయబారిగా కూడా పనిచేశానని.. అయినా తానేమీ చేయడం లేదని కొందరు అంటున్నారని ఆక్షేపించారు. ‘ఇప్పుడు కొందరు చైనా గురువులు ఉన్నారు. వారికి ఆ దేశమంటే వల్లమాలిన అభిమానం. వారిలో ఒకరు (జైరాం రమేశ్‌) ఈ సభలో నా ముందే కూర్చుని ఉన్నారు. ఏకంగా ‘చిండియా’ అనే పదాన్నే కనిపెట్టారు. ఇంకో చైనా గురువు (రాహుల్‌) ఉన్నారు. ఆయనలా నేను ఒలింపిక్స్‌కు వెళ్లి చైనా నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ప్రత్యేకమైన వ్యక్తిని కాకపోవడంతో ఆహ్వానం కూడా లేదు (యూపీఏ-1 హయాంలో 2008లో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ బీజింగ్‌ ఒలింపిక్స్‌కు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు). అక్కడ వారెవరిని కలిశారు? చైనా వాళ్లనే కాదు.. ఇతరులతోనూ (పాకిస్థాన్‌ నేతలు) భేటీ అయ్యారు. ఒలింపిక్స్‌ క్లాస్‌రూంలో అన్నీ నేర్చుకున్నట్లు లేరు. దీంతో ఢిల్లీలో చైనా రాయబారి ఇంటికి వెళ్లి ప్రైవేటు ట్యూషన్లు చెప్పించుకున్నారు. పాక్‌, చైనా చేరువయ్యాయని ఈ చైనా గురువు అంటున్నారు. పాక్‌ ఆక్రమిత కశ్మీరును వాళ్లు వదిలేయడం వల్లే ఆ రెండు దేశాలూ సన్నిహితమయ్యాయి’ అని తూర్పారబట్టారు. రాహుల్‌ తమకు వార్నింగ్‌ ఇస్తున్నారని.. చరిత్ర పాఠం చెబుతున్నప్పుడు ఆయన నిద్రపోయారేమోనని.. యూపీఏ హయాంలోనే చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యం పెరిగిందని.. పెట్టుబడుల కోసం చైనా కంపెనీలను ఆహ్వానించారని గుర్తుచేశారు.


జాతీయ భద్రత గురించి మాట్లాడుతున్నారని.. వారి హయాంలోనే శ్రీలంకలో హంబంటోటా పోర్టును చైనా కైవసం చేసుకుందని.. అప్పుడే భారత భద్రతకు చెప్పుకోలేనంత నష్టం వాటిల్లిందని స్పష్టంచేశారు. చైనాపై లెక్చర్లు దంచే చైనా గురువు ఇదంతా వారి హయాంలోనే జరిగిందనేది తెలుసుకోవాలని సూచించారు. పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన ఏప్రిల్‌ 22 నుంచి జూన్‌ 16 నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని మోదీ మధ్య ఒక్కసారి కూడా ఫోన్‌ చర్చలు జరుగనేలేదని తేల్చిచెప్పారు. సింధూ జలాల ఒప్పందం గురించి మాట్లాడుతూ.. ‘అసలు ఇలాంటి ఒప్పందం ఉంటుందని ఆలోచించలేం కూడా. ఒక దేశం తన ప్రధాన నదులు వేరే దేశంలో ప్రవహించడానికి అనుమతించడం.. అది కూడా ఆ నదులపై హక్కులు లేకుండా! నాటి ప్రధాని నెహ్రూ 1960 నవంబరు 30న పార్లమెంటులో మాట్లాడుతూ.. పాకిస్థానీ పంజాబ్‌ ప్రయోజనాల కోసం ఈ ఒప్పందం కుదుర్చుకోనివ్వాలని కోరారు. కశ్మీరు, పంజాబ్‌ రైతుల గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. సింధు జలాల ఒప్పందం, 370 అధికరణకు సంబంధించి నెహ్రూ చేసిన తప్పులను ప్రధాని మోదీ సరిదిద్దారు’ అని తెలిపారు. కాగా, కాంగ్రెస్‌ హయాంలో ఉగ్రదాడులకు పాల్పడినవారికి బిర్యాని పెట్టారని నడ్డా విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 03:38 AM