Share News

Punjab Shooting: పంజాబ్‌లో కలకలం.. గ్యాంగ్‌స్టర్ తల్లి హత్య

ABN , Publish Date - Jun 27 , 2025 | 10:37 AM

పంజాబ్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ తల్లి హత్యకు గురయ్యారు. వీధి పక్కన నిలిపి ఉంచిన కారులో ఉన్న ఆమెపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు.

Punjab Shooting: పంజాబ్‌లో కలకలం.. గ్యాంగ్‌స్టర్ తల్లి హత్య
Jaggu Bhagwanpuria Mother Killed

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్ జగ్గూ భగవాన్‌పురియా తల్లి హర్జీత్ కౌర్ దారుణ హత్యకు గురయ్యారు. కారులో ఉన్న ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి పరారయ్యారు. బటాలా నగరంలో గురువారం ఈ ఘటన జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. ఈ ఘటనలో ఆమె డ్రైవర్ కారులోనే మరణించాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ పుటేజీ నెట్టింట వైరల్‌గా మారింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, కాడియాన్ రోడ్డులో ఓ బేకరీ పక్కన కారులో కూర్చున్న ఆమెపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మోటర్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో డ్రైవర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హర్జీత్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా కన్నుమూశారు. తుపాకీ తుటా తగిలి తీవ్ర గాయాలు కావడంతో హర్జీత్ కన్నుమూసినట్టు బటాలా సివిల్ ఆసుపత్రి డాక్టర్. సుఖరాజ్ సింగ్ తెలిపారు. ఘటన సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకుని విచారణ ప్రారంభించామని స్థానిక డీఎస్పీ తెలిపారు. పరిసర ప్రాంతాల్లో చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.


ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే, గ్యాంగ్‌ల మధ్య వివాదంలో భాగంగా ఈ దారుణం జరిగుండొచ్చని పోలీసులు అంటున్నారు. హర్జీత్ కౌర్ కూడా స్థానిక రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. గతంలో భగవాన్‌పూర్ గ్రామపంచాయతీ సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఆమె ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్టు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. జైల్లోని తన కొడుకు భద్రతను పెంచాలంటూ పలుమార్లు హర్జీత్ కోర్టును కూడా ఆశ్రయించారు. జైల్లో తన కుమారుడికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇవ్వాలని ఓ సందర్భంలో గట్టిగా డిమాండ్ చేశారు.


పంజాబ్‌లో అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్‌లలో ఒకడిగా పేరు పొందిన జగ్గూ భగవాన్‌పూరియా ప్రస్తుతం అస్సాం జైల్లో ఉన్నాడు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హైప్రోఫైల్ హత్య కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. భటిండా జైల్లో ఉన్న అతడిని ఈ ఏడాది మొదట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. భద్రతా కారణాల రీత్యా అస్సాం జైలుకు తరలించింది.

ఇవి కూడా చదవండి:

పాక్‌కు కీలక సమాచారం లీక్.. నేవీ ప్రధాన కార్యాలయం ఉద్యోగి అరెస్టు

విమానాన్ని కూల్చేస్తా.. ఎయిర్ ఇండియా సిబ్బందికి మహిళా డాక్టర్ బెదిరింపులు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 27 , 2025 | 10:55 AM