Jagdeep Dhankha: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా!
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:29 AM
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే...
పార్లమెంటు సమావేశాల తొలిరోజే ఉపరాష్ట్రపతి సంచలన నిర్ణయం
అనారోగ్య కారణమంటూ రాష్ట్రపతికి లేఖ
రెండేళ్ల పదవీకాలం ఉండగానే విరమణ
అనారోగ్యం కాదు.. రాజకీయ కారణాలే
ధన్‌ఖడ్ నిర్ణయంపై విశ్లేషకుల అంచనా
సెప్టెంబరు 19లోపు ఉపరాష్ట్రపతి ఎన్నిక
అప్పటిదాకా డిప్యూటీ చైర్మన్‌కు బాధ్యతలు
న్యూఢిల్లీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే... తన పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల రీత్యా వైద్య సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖ పంపించారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ధన్‌ఖడ్ స్వయంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయన సోమవారం సాయంత్రం వరకు రాజ్యసభలో క్రియాశీలంగా ఉన్నారు. ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా వెనుక రాజకీయ కారణాలుండవచ్చునని ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని 67(ఎ) అధికరణ కింద తాను రాష్ట్రపతికి రాజీనామా లేఖను సమర్పించానని జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యమిచ్చేందుకు వైద్య సలహాను అనుసరించి తాను వెంటనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఇచ్చిన మద్దతు, విశ్వాసం, గౌరవాలకు గాను ప్రధానమంత్రికి, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. మహోన్నత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉప రాష్ట్రపతిగా తాను ఎన్నో అమూల్యమైన అనుభవాలు, అంతర్గత విషయాలను తెలుసుకున్నానని చెప్పారు. ఈ కీలక సమయంలో దేశంలో చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రగతి, అసాధారణమైన అభివృద్దిని చూడగలగడం తనకెంతో సంతృప్తి ఇచ్చిందని తెలిపారు. దేశ చరిత్రలో పరిణామాత్మకమైన సమయంలో దేశసేవ చేయడం తనకు లభించిన గౌరవంగా అభివర్ణించారు. ధన్‌ఖడ్‌కు వచ్చే ఏడాది ఏప్రిల్‌తో 75 ఏళ్లు పూర్తవుతాయి.
రెండేళ్లు ఉండగానే
వెంకయ్యనాయుడి తర్వాత 2022లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ధన్‌ఖడ్ నిజానికి 2027 ఆగస్టు 10 వరకు పదవిలో కొనసాగాల్సి ఉన్నది. ఆయన పైకి అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్లు చెబుతున్నప్పటికీ అంతర్గత రాజకీయ కారణాల వల్ల ఆయన తప్పుకొని ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతవరకూ ఏ ఉప రాష్ట్రపతీ మధ్యలో ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేయలేదని, ఆరోగ్యం దెబ్బతిన్న సందర్భాల్లో కూడా పదవిలో కొనసాగారని చెబుతున్నారు. ఇద్దరు ఉప రాష్ట్రపతులు మాత్రం రాష్ట్రపతి పద వికి పోటీ చేసేందుకు మధ్యలో రాజీనామా చేశారు. వీరిలో వి.వి.గిరి 1969 జూలై 20న రాజీనామా చేయగా, ఆర్.వెంకట్రామన్ 1987 జూలైలో రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్‌గా బాఽధ్యతలు నిర్వరిస్తున్న సమయంలో ఉపరాష్ట్రపతి అనారోగ్యానికి గురైతే వైస్ చైర్మన్ బాధ్యతలు నిర్వర్తించిన సందర్భాలున్నాయని, ప్యానెల్ చైర్మన్లు కూడా ఉంటారని, అందువల్ల ధన్‌ఖడ్ రాజీనామాకు ఇతరత్రా కారణాలుండవచ్చునని ఊహాగానాలు వినబడుతున్నాయి. అయితే, ఈ ఏడాది మార్చిలో దన్‌ఖడ్ గుండె సంబంధ సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. గత నెల కుమాయు విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవంలో స్పృహతప్పి పడిపోయారు. నిజానికి సోమవారం రాజ్యసభ సమావేశమైనపుడు ధన్‌ఖడ్ మామూలుగా వ్యవహరించారని, సభను సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అయిదుగురు కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ధన్‌ఖడ్.. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరగాలన్న విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్లు దొరకడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ధన్‌ఖడ్.. ఆయన అభిశంసనపై రాజ్యసభలో చర్చ నిర్వహించాల్సి ఉంది. ప్రతిపక్షాలు సమర్పించిన తీర్మానం నోటీసుపై రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తగు చర్యలు తీసుకొమ్మని ఆయన సమాచారం కూడా పంపారు. అంతా సవ్యంగానే జరుగుతున్నట్లు కనిపిస్తున్న సమయంలో ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో రాజకీయ వర్గాలకు అంతుబట్టడం లేదు.
ధన్‌ఖడ్ స్థానంలో ఎవరు?
కొత్త ఉప రాష్ట్రపతిని 60 రోజుల్లో ఎన్నుకోవాల్సి ఉన్నందువల్ల ప్రభుత్వం త్వరలో అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తుంది. సెప్టెంబరు19 లోపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి వస్తుంది. అంతవరకూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తాత్కాలికంగా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సంప్రదించి ఉప రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ పదవిలో ఎవరిని నియమించాలన్న విషయంపై మోదీ ఎన్డీఏ నేతలతో కూడా సంప్రదిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఉపరాష్ట్రపతిని ఉభయ సభల ఎంపీలు కలిసికట్టుగా ఎన్నుకుంటారు.
ఆరోగ్య కారణం నమ్మశక్యంగా లేదు
ధన్‌ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన చెబుతున్న కారణం నమ్మశక్యంగా లేదన్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయనతోనే ఉన్నానని, రాత్రి 7.30కు కూడా ఫోన్లో మాట్లాడానని తెలిపారు. రాజీనామా వెనుక బయటకు చెప్పేది కాకుండా ఇంకేదో ఉందని అభిప్రాయపడ్డారు. మంగళవారం సభా వ్యవహారాల కమిటీ సమావేశానికి నేతృత్వం వహించి, న్యాయవ్యవస్థకు(జస్టిస్ వర్మ) సంబంధించి కీలక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన ఆయన హఠాత్తుగా రాజీనామా చేయడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ధన్‌ఖడ్ మరోసారి తన నిర్ణయంపై ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని ప్రధాని కూడా జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News