Share News

ISRO: ఇస్రో.. డాకింగ్‌ రోదసిలో కరచాలనం

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:20 AM

పదిహేడు రోజుల ఉత్కంఠభరిత నిరీక్షణకు తెరపడింది! భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది!

ISRO: ఇస్రో.. డాకింగ్‌ రోదసిలో కరచాలనం

స్పేడెక్స్‌ చేజర్‌, టార్గెట్‌ ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియ సక్సెస్‌

‘ఉపగ్రహాల స్పేస్‌ డాకింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు, అంతరిక్ష రంగానికి అభినందనలు. రాబోయే రోజుల్లో భారత్‌ చేపట్టబోయే ముఖ్యమైన అంతరిక్ష యాత్రలకు ఇదొక ముఖ్యమైన మైలురాయి’

-ప్రధాని నరేంద్ర మోదీ

  • ఇప్పటికే ఆ ఘనత సాధించిన మూడు దేశాల సరసన భారత్‌

  • సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు

  • 7, 9 తేదీల్లో డాకింగ్‌కు యత్నం.. పలు కారణాలతో వాయిదా

  • జనవరి 12వ తేదీ నాటికి 15 మీటర్ల దూరానికి ఉపగ్రహాలు

  • గురువారం ఉదయం 9 గంటల సమయంలో డాకింగ్‌ పూర్తి

  • రెండు ఉపగ్రహాలూ నియంత్రణలోనే ఉన్నాయని ఇస్రో వెల్లడి

  • శాస్త్రజ్ఞులను అభినందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

సూళ్లూరుపేట, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పదిహేడు రోజుల ఉత్కంఠభరిత నిరీక్షణకు తెరపడింది! భారతీయులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది! స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌)లో భాగంగా గత నెల 30న భారత అంతరిక్ష పరిశోధనల సంస్థ (ఇస్రో) రోదసిలోకి ప్రవేశపెట్టిన ఎస్‌డీఎక్స్‌-01 (చేజర్‌), ఎస్‌డీఎక్స్‌-02 (టార్గెట్‌) ఉపగ్రహాలను.. బెంగళూరులోని ఇస్ట్రాక్‌ ట్రాకింగ్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు గురువారం ఉదయం 9 గంటల సమయంలో విజయవంతంగా అనుసంధానించారు. డిసెంబరు 30న శ్రీహరికోటలోని షార్‌ మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎ్‌సఎల్వీ-సీ 60 రాకెట్‌ ద్వారా జంట ఉపగ్రహాలను రోదసిలోకి పంపిన సంగతి తెలిసిందే. ఈ ఉపగ్రహాలు అప్పటి నుంచీ కక్ష్యలో తిరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటీ 220 కేజీల బరువుండే ఈ రెండు శాటిలైట్ల మధ్య దూరం 20 కిలోమీటర్లు ఉండేలా లాంచింగ్‌ సమయంలోనే జాగ్రత్తలు తీసుకున్నారు. తర్వాత క్రమంగా వీటి మధ్య దూరాన్ని తగ్గించుకుంటూ వచ్చి 7వ తేదీన ఉదయం 9.30 గంటల సమయంలో అనుసంధానం చేయాలని భావించారు.


ఈ మేరకు ఇస్రో చైర్మన్‌ ఒక ప్రకటన కూడా చేశారు. అయితే చేజర్‌ ఉపగ్రహంలోని అనుసంధాన లింకు తెరుచుకోకపోవడంతో ఆ ప్రక్రియను జనవరి 9కి వాయిదా వేశారు. ఆ సమయంలో ఆ రెండు ఉపగ్రహాలు 1.5 కి.మీ దూరంలో ప్రయాణిస్తున్నాయి. వాటిని ఆ రోజు 1.3 కి.మీ దగ్గరికి తీసుకొచ్చారు. రెండింటిమధ్య దూరాన్ని 225 మీటర్లకు తగ్గించేందుకు ప్రయత్నించి.. వాటి వేగం అదుపులోకి రాకపోవడంతో అనుసంధాన ప్రక్రియను జనవరి 11కి వాయిదా వేశారు. ఆ రోజునరెండు ఉపగ్రహాలనూ 230 మీటర్ల దగ్గరకు తీసుకొచ్చారు. జనవరి 12న ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్లకు తీసుకొచ్చారు. కొంత సమయం తర్వాత ఉపగ్రహాల వేగాన్ని నియంత్రించుకుంటూ రెండింటినీ 10 అడుగుల (3 మీటర్లు) దగ్గరకు చేర్చారు. ఎట్టకేలకు గురువారం ఉదయం 9 గంటలకు నెమ్మదిగా రెండింటినీ అనుసంధానించారు. అవి నియంత్రణలోనే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత.. డాకింగ్‌ విజయవంతమైనట్టు ఇస్రో వెల్లడించింది. దీన్నో చరిత్రాత్మక విజయంగా అభివర్ణించింది. ఏకమైన రెండు ఉపగ్రహాలూ నియంత్రణలోనే ఉన్నాయని.. ఇకపై అన్‌డాకింగ్‌, విద్యుత్తు బదిలీ తదితర ప్రక్రియలు చేపడతామని పేర్కొంది.


డాకింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్టు తెలియగానే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష కార్యక్రమం చరిత్రాత్మక మైలురాయిని అధిగమించిందని కొనియాడారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ కూడా ఇస్రోను అభినందించారు. ‘నమ్మశక్యం కాని విజయం ఇది. స్పేడెక్స్‌... డాకింగ్‌ పూర్తయింది. ఇది ఇప్పుడు స్వదేసీ భారతీయ డాకింగ్‌ వ్యవస్థ’ అన్నారు. ఈ విజయం.. భవిష్యత్తులో చేపట్టబోయే భారతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్‌ 4, గగన్‌యాన్‌ ప్రయోగాలను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిర్వహించేందుకు బాటలు వేసిందని కొనియాడారు. ఇస్రో చైర్మన్‌ వి నారాయణన్‌ కూడా.. మిషన్‌ను విజయవంతం చేసిన బృందాన్ని అభినందించారు. ఈ ప్రయోగంలో కీలక భాగస్వామి అయిన అనంత్‌ టెక్నాలజీస్‌ కూడా ఇస్రో శాస్త్రజ్ఞులకు హృదయపూర్వక అభినందనలు తెలిపింది. భారత అంతరిక్ష ప్రయోగాల ప్రస్థానంలో అత్యంత కీలకమైన ప్రాజెక్టులో ప్రధాన భూమిక పోషించడం తమకు గర్వకారణమని ఆ సంస్థ సీఎండీ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు పేర్కొన్నారు.


ఎన్నో ఉపయోగాలు..

ఉపగ్రహాల డాకింగ్‌ ప్రక్రియ విజయవంతం కావడంతో.. భారత్‌ సొంత అంతరిక్ష కేంద్ర ఏర్పాటుకు మార్గం సుగమమైందని చెప్పవచ్చు. అలాగే.. భారత్‌ చేపట్టబోయే గగన్‌యాన్‌కు కూడా డాకింగ్‌ పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక, చంద్రయాన్‌-4లో భాగంగా.. చంద్రుడి నమూనాలను తేవడమే లక్ష్యంగా పెట్టుకొన్న ఇస్రో అందుకోసం రెండు రాకెట్ల ద్వారా విభిన్న మాడ్యూళ్లను రోదసిలోకి పంపనుంది. ఈ అనుభవంతో.. చంద్రుడి కక్ష్యలో ఆ మాడ్యూళ్లను అనుసంధానం చేయడం ఇస్రోకు సులభం అవుతుంది. అందుకే ఇస్రో ఈ ప్రయోగాన్ని ఇంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ విజయంతో.. ఆ ప్రయోగాలు మరింత వేగవంతమవుతాయి.

21.jpg


డాకింగ్‌ విజయ సారథులు వీరే

డాకింగ్‌ ప్రక్రియలో బెంగళూరు యూఆర్‌రావు ఉపగ్రహ తయారీ కేంద్రం శాస్త్రవేత్తల పాత్ర కీలకమైనది. స్పేడెక్స్‌ ఉపగ్రహాల రూపకల్పన నుంచీ.. వీరు ఈ ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శాటిలైట్‌ డైరెక్టర్‌ ఎం.శంకరన్‌, మరో డైరెక్టర్‌ ఎన్‌.సురేంద్రన్‌, మిషన్‌ డైరెక్టర్‌ జయకుమార్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం మూడేళ్ల కృషికి ఫలితం ఈ విజయం. అలాగే.. బెంగళూరుకు చెందిన అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ సహకారం కూడా ఈ విజయానికి ఎంతో ఉపకరించింది.


డాకింగ్‌ వీరుడు శంకరన్‌

డాకింగ్‌ సాంకేతికత సాధించడంలో ప్రధాన భూమిక పోషించిన వారిలో బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎం.శంకరన్‌ ఒకరు. గతంలో ఇస్రో చేపట్టిన పలు భారీ ప్రయోగాల్లో శంకరన్‌ కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై సాఫ్ట్‌గా ల్యాండింగ్‌ కావడంలో ఈయన పాత్ర ఎంతో ఉంది. తమిళనాడులోని తిరువాయూరుకు చెందిన శంకరన్‌.. నావిగేషన్‌, కమ్యూనికేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌, వాతావరణ పరిశోధనల ఉపగ్రహ ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించారు.


చరిత్రలో తొలి డాకింగ్‌.. 1966లో!

రోదసిలో డాకింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారతదేశం గురువారం చరిత్ర సృష్టించింది సరే.. మరి ఆ ఘనత సాధించిన మొదటి దేశమేది? అంటే.. అమెరికా. 1966 మార్చి 16న.. అమెరికాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, డేవిడ్‌ స్కాట్‌ నడుపుతున్న జెమిని 8 క్యాప్సూల్‌.. ఏజెనా టార్గెట్‌ వెహికల్‌ అనే చోదక రహిత వ్యోమనౌకతో డాక్‌ అయ్యింది. అదే మానవాళి చరిత్రలో తొలి డాకింగ్‌. రోదసిలో రెండు వ్యోమనౌకలూ విజయవంతంగా డాక్‌ అయ్యాయి. కానీ.. క్షణాల వ్యవధిలోనే జెమినీ 8 అదుపులో లేకుండా పోయింది. అప్రమత్తమైన నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ జెమిని 8ను అన్‌డాక్‌ చేసినా.. అది అదుపులోకి రాలేదు. దీంతో.. నాసా శాస్త్రజ్ఞులు ఆ వ్యోమనౌకను షెడ్యూలుకు భిన్నంగా పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలో పడిపోయేలా చేసి, వ్యోమగాములను కాపాడుకున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 04:20 AM