Share News

Trump Hypocrisy: ట్రంప్ ద్వంద్వనీతి.. 1954 నుంచి పాక్‌కు అమెరికా ఆయుధాల ఎగుమతి చూస్తే షాకవ్వాల్సిందే

ABN , Publish Date - Aug 05 , 2025 | 08:21 PM

పాకిస్థాన్‌కు ఆయుధాలు అమ్మేందుకు ఫ్రాన్స్, సోవియట్ యూనియన్‌ వంటి దేశాలు నిరాకరిస్తే, ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కూడా పాకిస్థాన్‌కు అమెరికా ఆయుధాల సరఫరాను కొనసాగించిందని శుక్లా పార్లమెంటులో చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Trump Hypocrisy: ట్రంప్ ద్వంద్వనీతి.. 1954 నుంచి పాక్‌కు అమెరికా ఆయుధాల ఎగుమతి చూస్తే షాకవ్వాల్సిందే
Donald Trump with Narendra Modi

న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తే ఇండియాపై ప్రస్తుతం విధిస్తున్న 25 శాతం సుంకాలను రాబోయే 24 గంటల్లో మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు జరిపిన కొద్ది గంటలకే ట్రంప్ 'హిపోక్రసీ'ని ఇండియన్ ఆర్మీ ఎండగట్టింది. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌కు అందజేసిన సాయంపై నిలదీసింది. 1954 నుంచి పాక్‌కు 2 బిలియన్ డాలర్లు విలువ చేసే ఆయుధాలను అమెరికా పంపించిందని తెలిపింది. ఇందుకు సంబంధించి 1971 ఆగస్టు 5న వార్తాపత్రికలో వచ్చిన క్లిప్పింగ్‌ను ఇండియన్ ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ విడుదల చేసింది.


'1954 నుంచి పాకిస్థాన్‌కు 2 బిలియన్ డాలర్లు విలువచేసే ఆయుధాలు సరఫరా అయ్యాయి' అనే శీర్షికతో ఈ కథనం ప్రచురితమైంది. బంగ్లాదేశ్‌లో ఇస్లామాబాద్ దురాక్రమణను నాటో దేశాలు పట్టించుకోలేదని కూడా ఆ కథనం ఆరోపించింది.


అప్పటి రక్షణ ఉత్పత్తుల మంత్రి వీసీ శుక్లా పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు కూడా ఆ కథనం పేర్కొంది. పాకిస్థాన్‌కు ఆయుధాలు అమ్మేందుకు ఫ్రాన్స్, సోవియట్ యూనియన్‌ వంటి దేశాలు నిరాకరిస్తే, ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కూడా పాకిస్థాన్ కు అమెరికా ఆయుధాల సరఫరాను కొనసాగించిందని శుక్లా పార్లమెంటులో చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 1971 ఘర్షణల్లో బంగ్లాదేశ్‌లో పాకిస్థాన్ చర్యలను నాటో దేశాలు పట్టించుకోలేదని మంత్రి ఆక్షేపణ తెలిపారు. అమెరికా, చైనాలు ఆకర్షణీయ ధరలకు తమ ఆయుధాలను పాక్‌కు అమ్ముకున్నారని, ఆ దేశాలు సమకూర్చిన ఆయుధాలతోనే పాకిస్థాన్ యుద్ధం చేసిందని ఆయన అన్నారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న దశలో ఈ కథనం ప్రచురితమైంది. ఆ తర్వాత కొద్ది నెలలకు బంగ్లాదేశ్ స్వాతంత్ర్యానికి మద్దతుగా భారత్ నిలిచింది.


కాగా, ట్రంప్ తాజా హెచ్చరికలపై భారత్ నిశిత వ్యాఖ్యలు చేసింది. వాషింగ్టన్ ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు చమురు ధరలు చుక్కలనంటినప్పుడు రష్యా నుంచి దిగుమతులను ఆమెరికా ప్రోత్సహించిందని గుర్తుచేసింది. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగానే ఇండియా కొనుగోళ్లు ఉంటాయని తెలిపింది. అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల తరహాలోనే జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను భారత్ తీసుకుంటోందని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

సార్వభౌమాధికార దేశాలకు బెదిరింపులా.. భారత్‌కు బాసటగా అమెరికాపై రష్యా నిప్పులు

భారత-రష్యా చమురు డీల్స్‌పై.. ట్రంప్ సర్కార్ ఒత్తిడి

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 05 , 2025 | 08:58 PM