Share News

Indian Semiconductor: వచ్చేసింది స్వదేశీ చిప్‌ విక్రమ్‌ 32

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:06 AM

సెమీకండక్టర్ల తయారీలో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న భారత్‌ దేశీయంగా తయారుచేసిన తొలి చిప్‌...

Indian Semiconductor: వచ్చేసింది స్వదేశీ చిప్‌ విక్రమ్‌ 32

సెమీకండక్టర్ల తయారీలో భారత్‌ చరిత్ర

  • దేశీయంగా తయారైన తొలి చిప్‌ ఆవిష్కరణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: సెమీకండక్టర్ల తయారీలో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న భారత్‌ దేశీయంగా తయారుచేసిన తొలి చిప్‌ విక్రమ్‌-32 (విక్రమ్‌-3201) బిట్‌ ప్రాసెసర్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ఇస్రోకు చెందిన సెమీకండక్టర్‌ లేబొరేటరీ(ఎస్‌సీఎల్‌) అభివృద్ధి చేసిన మేడిన్‌ ఇండియా చిప్‌ను కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మంగళవారం ప్రారంభమైన సెమికాన్‌ ఇండియా-2025 సదస్సులో ప్రధాని మోదీకి అందజేశారు. సెమీ కండక్టర్ల రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో 2021లోనే భారత్‌ సెమీకండక్టర్‌ మిషన్‌ను ప్రారంభించింది. కేవలం మూడున్నర ఏళ్లలోనే ఇస్రో తొలి చిప్‌ను విక్రమ్‌-32ను అందుబాటులోకి తీసుకొచ్చింది. విక్రమ్‌-32 అనేది కంప్యూటర్‌ చిప్‌. అంతరిక్షంలో ఎదురయ్యే అత్యంత కఠిన పరిస్థితులు, వాతావరణాన్ని సైతం తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఇది -55 డిగ్రీల నుంచి +125 డిగ్రీల ఉష్ణోగ్రతలను సైతం తట్టుకోగలదు. ఇది ఒకేసారి 32 బిట్‌ల నుంచి డేటాను ప్రాసెస్‌ చేయగలదు. ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ఫోన్‌ వంటి పరికరాలకు కాకుండా అంతరిక్ష పరిశోధనల కోసం దీన్ని రూపొందించారు. ఈ చిప్‌లను రాకెట్లు, ఉపగ్రహాలు, లాంచ్‌ వెహికిల్‌ ఏవియానిక్స్‌లో వాడనున్నారు.

పీఎ్‌సఎల్వీ-సీ60లో వినియోగం..

ఇస్రో చేపట్టిన పీఎ్‌సఎల్వీ-సీ60 ప్రాజెక్టులో విక్రమ్‌-32ను పరీక్షించారు. ఈ ప్రాజెక్టులోని ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ మాడ్యూల్‌లోని మిషన్‌ మేనేజ్‌మెంట్‌ కంప్యూటర్‌లో దీన్ని ఉపయోగించగా.. ఇది అద్భుతంగా పనిచేసింది. సెమికాన్‌ ఇండియా-2025లో విక్రమ్‌-32 చిప్‌ను ప్రధాని మోదీకి అందించిన సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. భారత్‌లో కొత్తగా ఐదు సెమీకండక్టర్‌ యూనిట్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. అలాగే ఆరు రాష్ట్రాల్లో రూ.1.60 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులతో 10 ప్రధాన ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని తెలిపారు. డిజైన్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ కింద 23కిపైగా డిజైన్‌ స్టార్ట్‌పలను ప్రోత్సహిస్తున్నామని, దీంతో ప్రపంచ సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ ఓ వెలుగు వెలగనుందని చెప్పారు.


20 శాతం చిప్‌ ఇంజనీర్లు భారత్‌లోనే

సెమీకండక్టర్‌ డిజైన్‌ రంగంలో భారత్‌ కీలక శక్తిగా ఎదుగుతోంది. ప్రపంచంలోని చిప్‌ డిజైన్‌ ఇంజనీర్లలో 20ు మంది ఇక్కడే ఉన్నారని బాస్టియన్‌ రిసెర్చ్‌ నివేదిక చెబుతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్వాల్‌కామ్‌, ఇంటెల్‌, ఎన్‌విడియా, బ్రాడ్‌కామ్‌, మీడియాటెక్‌ సంస్థలు బెంగళూరు, హైదరాబాద్‌, నోయిడాల్లో పెద్ద పరిశోధన, అభివృద్ధి, డిజైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 2021లో దాదాపు 76వేల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందిస్తూ సెమికాన్‌ ఇండియా మిషన్‌ను ప్రారంభించడం వల్లే ఇప్పుడు దేశంలో సెమీకండక్టర్‌ వ్యవస్థ బలోపేతమైందని ఈ నివేదిక తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2025 | 03:06 AM