Share News

India Slams Pakistan Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ అణు హెచ్చరికపై.. భారత్ ఘాటు ప్రతిస్పందన

ABN , Publish Date - Aug 12 , 2025 | 07:39 AM

పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసీమ్ మునీర్ ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. అతని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, అణు ఆయుధాల నియంత్రణలో వాళ్ల విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయని వెల్లడించింది.

India Slams Pakistan Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ అణు హెచ్చరికపై.. భారత్ ఘాటు ప్రతిస్పందన
India Slams Pakistan Army Chief

ఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధం జరిగి అది పాకిస్తాన్‌కు ప్రమాదకరంగా మారితే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరికలు చేశాడు అసీమ్ మునీర్. ఈ వ్యాఖ్యలు అమెరికా నేల మీద నుంచి వచ్చిన తొలి అణు బెదిరింపు అని చెప్పవచ్చు. భారత విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది (India Slams Pakistan Army Chief).

పాకిస్తాన్ సైన్యం

పాకిస్తాన్ అణు ఆయుధాలతో బెదిరించడం కొత్తేమీ కాదని, కానీ ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు స్నేహపూర్వక దేశం నేల మీద నుంచి రావడం బాధాకరమని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇలాంటి మాటలు పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద గ్రూపులతో చేతులు కలిపి పనిచేస్తోందనే సందేహాలను మరింత బలపరుస్తాయి. అణు ఆయుధాల నియంత్రణలో వాళ్ల విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తిస్తాయని కూడా తెలిపింది. తాము అణు బ్లాక్‌మెయిల్‌కు లొంగమని, దేశ భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.


ఇది పాక్ నిజ స్వరూపమా?

కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఈ విషయంలో గట్టిగా స్పందించాయి. పాకిస్తాన్ అణు ఆయుధాలతో బాధ్యతారహిత దేశంగా మారింది. అమెరికా మద్దతు ఉన్నప్పుడల్లా పాక్ సైన్యం ఇలాంటి నిజ స్వరూపం చూపిస్తుందని అన్నాయి. అంతేకాదు, పాకిస్తాన్‌లో ప్రభుత్వం నియంత్రణ ఉండదు. అక్కడ సైన్యమే అన్నీ నియంత్రిస్తుంది. ఇలాంటి వాతావరణంలో అణు ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించాయి. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి. అయితే పాకిస్తాన్ ఇలాంటి బెదిరింపులు చేయడం కొత్తేమీ కాదు. కానీ అమెరికా లాంటి మూడో దేశం నుంచి ఇలాంటి మాటలు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.


పాక్ ఆర్మీ చీఫ్ ఏమన్నాడు..

అమెరికాలోని ఫ్లోరిడాలో పాకిస్తానీ సంతతి ప్రజల సమావేశంలో మాట్లాడిన అసీమ్ మునీర్.. తాము అణుశక్తితో ఉన్న దేశమని, తమ దేశం ప్రమాదంలో పడితే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించాడు. అంతేకాదు, భారత్ సిందూ నదీ జలాలపై ఆనకట్టలు నిర్మిస్తే 10 క్షిపణులతో వాటిని ధ్వంసం చేస్తామన్నారు. తమకు క్షిపణుల కొరత లేదని అన్నాడు. ఈ హెచ్చరికలు ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ సిందూ ఒప్పందాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో వచ్చాయి. మునీర్ మాటల ప్రకారం, భారత్ ఆ నిర్ణయం వల్ల 25 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం ఉందట.


ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2025 | 08:56 AM