Lahore Drone Strike: డ్రోన్ దాడి జరిగితే పిడుగుపాటు అని కవరింగ్
ABN , Publish Date - May 09 , 2025 | 04:12 AM
భారత డ్రోన్ దాడుల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్రంగా దెబ్బతిన్నది. రావల్పిండిలో భారీ నష్టం, పీఎస్‌ఎల్ రద్దు, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
రావల్పిండిలో భారీ నష్టం.. పాకిస్థాన్ సూపర్ లీగ్ రద్దు
లాహోర్‌లోని వాల్టన్‌లో నలుగురు సైనికులకు గాయాలు
లాహోర్‌కు నష్టం జరగలేదు: ఖవాజా
ప్రతీకారం తీర్చుకుంటాం: షెహబాజ్
(సెంట్రల్ డెస్క్)
‘‘భారత్ డ్రోన్లతో దాడి చేసింది. ఆ దాడిని ప్రత్యక్షంగా చూశాను. ఏం జరిగిందో చూడాలని అటువైపు వెళ్తుండగా పోలీసులు, సైనికులు అడ్డుకున్నారు. ఏమైంది? పెద్ద శబ్దం వచ్చింది? అని ప్రశ్నిస్తే.. వర్షాల కారణంగా భారీ పిడుగు పడిందని చెప్పారు. నేను కళ్లారా డ్రోన్లను చూశాను. ఇంత దారుణంగా ఏమార్చడం సిగ్గుచేటు’’.. రావల్పిండికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ఓ వీడియోలో తన ఆవేదనను వెల్లడించాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు కూడా ఓ న్యూస్ చానల్ మాట్లాడుతూ పాక్ సైన్యం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించాడు. భారత్‌తో యుద్ధం మరింత ముదురుతుందేమోననే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయి. పౌరులు ముందుజాగ్రత్తగా ఏటీఎంలలో, బ్యాంకులలోంచి నగదును డ్రా చేసుకుంటూ.. నిత్యావసరాలను నిల్వ చేసుకుంటున్నారు. లాహోర్‌లోని డీహెచ్ ఫేస్-8, ఆస్కారీ-11 నుంచి ప్రజలను ఖాళీ చేయాలని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతాలు లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సమీపంలో ఉంటాయి. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ రెండో రోజు పాక్‌లోని లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్‌వాలా, బహావల్‌పూర్, సియాల్‌కోట్, సింధ్ తదితర ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, మిలటరీ స్థావరాలను టార్గెట్‌గా చేసుకుంది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నిర్వీర్యమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల వైపు దూసుకొచ్చిన భారత డ్రోన్లను సమర్థంగా కూల్చేశామని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎ్‌సపీఆర్) డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో చెప్పారు. భారత్ డ్రోన్ దాడుల్లో ముగ్గురు పౌరులు మృతిచెందారని, లాహోర్‌లోని వాల్టన్ వద్ద నలుగురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారని, సైనిక స్థావరాలకు స్వల్పంగా నష్టం వాటిల్లిందని వెల్లడించారు. 29 భారత డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించారు. తాము భారత్‌లోని 15 ప్రాంతాలపై దాడి చేశామని చెప్పడం నిజం కాదని, తాము దాడి చేస్తే ప్రపంచానికి తెలుస్తుందన్నారు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ మాజీ మేజర్, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) తాహీర్ ఇక్బాల్ ‘దేవుడా.. నువ్వే దిక్కు. పాకిస్థాన్‌ను కాపాడు. భారత్ నుంచి రక్షించు’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, భారత్ డ్రోన్ దాడిలో లాహోర్‌లోని రక్షణ వ్యవస్థకు ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ సురక్షితంగా ఉందని చెప్పారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ సైన్యం
‘ఆపరేషన్ సిందూర్’ తొలిరోజు దాడిలో మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై విమర్శలు రాగా.. ‘‘మా సైన్యాధికారి కుమారుడు(7) కూడా భారత్ దాడిలో చనిపోయాడు. అందుకే ఆర్మీ వచ్చింది’’ అని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కాగా.. భారత్ దాడిలో మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు నివాళులర్పించడం గమనార్హం.
భారీ నష్టం?
ఎల్‌వోసీ సమీపంలోని ఖంజో, సర్ఫరాజ్ లెఘారీ గ్రామాలు, చక్వాల్‌లోని ధమన్ తదితర ప్రాంతాల్లో మసీదులు ధ్వంసమయ్యాయని, పౌరుల ఇళ్లు దెబ్బతిన్నాయని పాక్ మీడియా పేర్కొంది. రావల్పిండిలో నష్టం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ ప్రాంతాల్లోని దళాలు డ్రోన్లను కూల్చివేసినట్లు వివరించింది. దీంతో రావల్పిండి నుంచి పాక్ సూపర్ లీగ్ క్రికెట్ ఆటగాళ్లను ఇతర ప్రాంతాలకు తరలించి, లీగ్‌ను రద్దు చేశారని వివరించింది. భారత్ దాడుల ముప్పు నేపథ్యంలో ఓడరేవుల వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది. పడవలు, నౌకలను సముద్రంలోకి వెళ్లనివ్వడం లేదు. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, సియాల్‌కోట్ విమానాశ్రయాల్లో రాకపోకలను నిలిపివేశారు