Share News

Missile Rivalry: భారత్‌, పాక్‌ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:11 AM

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాలు అరేబియా సముద్రంలో పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించగా, భారత్ ఐఎన్‌ఎస్ సూరత్ నుంచి ఎంఆర్-ఎస్‌ఏఎం క్షిపణిని, ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను మోహరించింది

Missile Rivalry: భారత్‌, పాక్‌ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు

  • ఎంఆర్‌-ఎస్‌ఏఎంను పరీక్షించిన భారత నౌకాదళం

  • అరేబియా జలాల్లో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మోహరింపు

  • ఒకటి రెండు రోజుల్లో పరీక్షలకు పాక్‌ నోటమ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడితో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అరేబియా సముద్ర ప్రాంతంలో ఇరు దేశాలూ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. తాము క్షిపణి పరీక్షలు చేపడతామంటూ పాకిస్థాన్‌ మిలటరీ నోటమ్‌ జారీ చేసిన క్రమంలో.. భారత నౌకాదళం సైతం అరేబియా సముద్రంలో క్షిపణి పరీక్షను విజయవంతంగా చేపట్టింది. నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్‌ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్‌ సూరత్‌ నుంచి సీ స్కిమ్మింగ్‌ టార్గెట్లను ఛేదించే సత్తా కలిగిన క్షిపణిని పరీక్షించింది. 70 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌(ఎంఆర్‌-ఎస్‌ఏఎం)ను పరీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్యాన్ని అది అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం గురువారం వెల్లడించింది. కాగా, ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ముంబైలోని నేవల్‌ డాక్‌ యార్డులో ఐఎన్‌ఎస్‌ సూరత్‌ను ప్రారంభించారు. ఇదొక పీ15బీ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక.


నోటమ్‌ జారీ చేసిన పాక్‌

పహల్గాం ఉగ్రదాడి అనంతరం తాము ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షలను చేపడతామంటూ పాకిస్థాన్‌ మిలటరీ నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌/మెరైనర్స్‌) జారీ చేసింది. గురు, శుక్ర వారాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అందులో పేర్కొంది. కానీ.. అదే సమయంలో ఐఎన్‌ఎస్‌ సూరత్‌ నుంచి భారత నౌకాదళం సీ స్కిమ్మింగ్‌ టార్గెట్లను ఛేదించే మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిస్సైల్‌ను పరీక్షించడం గమనార్హం. వాస్తవానికి ఉపరితలంపై నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులపై ఎంఆర్‌- ఎస్‌ఏఎంలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. కాగా, అరేబియా సముద్ర ప్రాంతంలో పాక్‌ నేవీ నావికాదళ విన్యాసాలు ప్రారంభించిందని, దీనిలో క్షిపణి పరీక్ష కూడా ఉందని భారత రక్షణ, భద్రత వర్గాలు తెలిపాయి. పాక్‌ తన గగనతల రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసిందని, భారత విమానాల కదలికలను ట్రాక్‌ చేయడానికి వారి అవాక్స్‌ నిరంతర నిఘా పెట్టిందని ఆ వర్గాలు వెల్లడించాయి.


అరేబియా జలాల్లోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌

పహల్గాం దాడి అనంతరం.. పాకిస్థాన్‌ అరేబియా సముద్ర ప్రాంతంలో క్షిపణి ప్రయోగాలు ప్రారంభించింది. దీనికి ప్రతిస్పందనగా భారత నౌకాదళం కూడా విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను రంగంలోకి దింపింది. ఇది కర్ణాటకలోని కార్వార్‌ నావల్‌ బేస్‌ నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్తున్నట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా నిర్ధారణ అయింది. దేశీయంగా నిర్మించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ 262 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది 40 ఫైటర్‌ జెట్లను మోసుకెళ్లగలదు. ఈ యుద్ధనౌకలో 2 స్క్వాడ్రన్ల మిగ్‌-29 యుద్ధవిమానాలు, పది కమోవ్‌ కేఏ-31 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ యుద్ధనౌక స్ట్రైక్‌ ఫోర్స్‌ పరిధి 1500 కి.మీ.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 04:11 AM