Share News

Military Robotics: సైన్యానికి హ్యూమనాయిడ్‌ రోబో అండ

ABN , Publish Date - May 11 , 2025 | 04:02 AM

భారత సైన్యం కోసం డీఆర్‌డీవో హ్యుమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది, దీని ద్వారా ప్రమాదకరమైన పరిస్థితుల్లో సైన్యానికి సహాయం చేస్తుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

 Military Robotics: సైన్యానికి హ్యూమనాయిడ్‌ రోబో అండ

  • అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీవో.. రిస్క్‌ను తగ్గించమే లక్ష్యం

  • 2027 నాటికి రోబో సిద్ధం

పుణె, మే 10: భారత సైన్యానికి అండగా ఉండేందుకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) సరికొత్త ఆవిష్కరణ చేస్తోంది. మిలిటరీ కార్యకలాపాల్లో ముందుండి దళాలకు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో హ్యుమనాయిడ్‌ (మానవాకృతిలో ఉండే) రోబోను సిద్ధం చేస్తోంది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో దళాల ప్రత్యక్ష ప్రమేయాన్ని తగ్గించడానికి, మానవ ఆదేశాల మేరకు క్లిష్టమైన పనులు పూర్తి చేయడానికి డీఆర్‌డీవోకు చెందిన రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ (ఇంజనీర్స్‌) ఈ హ్యూమనాయిడ్‌ రోబోను అభివృద్ధి చేస్తోంది. నాలుగేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు కోసం ఒక బృందం పనిచేస్తోందని సెంటర్‌ ఫర్‌ సిస్టమ్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ఎస్‌ఈ తలోల్‌ పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. చేతులు, కాళ్లు ఉండే రోబో శరీరానికి సంబంధించి కింది, పైన భాగాలకు వేరు వేరు నమూనాలను తయారు చేశామని చెప్పారు. అంతర్గత పరీక్షలన్నీ విజయవంతమయ్యాయని ఆయన వివరించారు. దట్టమైన అడవుల్లాంటి కఠిన భౌగోళిక పరిస్థితుల్లో కూడా ఆ రోబో సమర్థంగా పనిచేస్తుందని తెలిపారు. ఇటీవల పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ రోబోను ప్రదర్శించామని పేర్కొన్నారు. మూడు కీలక అంశాలతో ఇది పనిచేస్తుందన్నారు. మానవ శరీర కండరాలు కదలికల వలే రోబో కదలికలు ఉండేలా యాక్టువేటర్స్‌ చూస్తాయని, సమీప ప్రాంతాల్లోని రియల్‌ టైం డేటాను సెన్సార్లు సేకరిస్తాయని, ఆ డేటాను కంట్రోల్‌ సిస్టమ్‌ విశ్లేషించి ఆదేశాలు ఇస్తుందని తలోల్‌ తెలిపారు. బ్యాలెన్స్‌గా ఉంటూ చెప్పిన పనులు పూర్తిచేయడం, డేటాను వేగంగా విశ్లేషించి క్షేత్రస్థాయిలో రోబోతో పనుల పూర్తి చేసేలా చేయడమే తమ ముందున్న పెద్ద సవాల్‌ అని డిజైన్‌ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్న కిరణ్‌ ఆకెళ్ల పేర్కొన్నారు. 2027 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

Updated Date - May 11 , 2025 | 04:03 AM