Share News

Cyber Fraud: రూ. 260 కోట్ల సైబర్ మోసం, ఈడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు

ABN , Publish Date - Aug 06 , 2025 | 08:22 PM

నోయిడా కేంద్రంగా జరిగిన రూ. 260 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ ఇది. సైబర్ నేరగాళ్లు.. పోలీసు అధికారులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల సిబ్బందిగా నటించి దేశ, విదేశీయుల్ని బెదిరించారు. అమెజాన్ ఏజెంట్లమని చెప్పి..

Cyber Fraud: రూ. 260 కోట్ల సైబర్ మోసం, ఈడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు
Cyber Fraud

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో రూ. 260 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీ స్కామ్ బట్టబయలైంది. అంతర్జాతీయ సైబర్ మోసం కేసును ఛేదించేందుకు ఈడీ ఇవాళ దాడులు చేసింది. క్రిప్టో కరెన్సీ ద్వారా అక్రమ లావాదేవీలు, అంతర్జాతీయ మనీలాండరింగ్‌తో సంబంధం ఉన్న ఈ కేసు, ఇండియా, విదేశీయులను లక్ష్యంగా చేసుకున్న నేరస్థుల నెట్‌వర్క్‌ను బయటపెట్టింది. దీనికి సంబంధించి ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఇంకా డెహ్రాడూన్‌లోని 11 ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన FIRల ఆధారంగా ఈడీ ఈ దాడులు చేసింది. నేరగాళ్లు, పోలీసు అధికారులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల సిబ్బందిగా నటించి దేశ, విదేశీయుల్ని బెదిరించారు. అరెస్టు చేస్తామని చెప్పి బాధితుల నుండి డబ్బును బలవంతంగా రాబట్టారు. కొన్ని సందర్భాల్లో, నేరస్థులు మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీల టెక్నికల్ సపోర్ట్ ఏజెంట్లుగా కూడా నటించి, సాంకేతిక సహాయం అందిస్తామని నమ్మబలికి బాధితుల నుండి డబ్బును కాజేశారు.


ఈ కాజేసిన సొమ్ములన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలో బిట్‌కాయిన్‌లుగా మార్చి, హవాలా ఛానెల్‌ల ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి విదేశాలకు తరలించినట్టు తెలుస్తోంది. నోయిడాలోని ఒక కాల్ సెంటర్ ఈ స్కామ్‌కు ప్రధాన కేంద్రంగా గుర్తించారు. ఈ కాల్ సెంటర్ ద్వారానే నేరస్థులు తమ నెట్‌వర్క్‌ను నడిపించారు. వీరికి కొన్ని షెల్ కంపెనీలు, విదేశీ సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నాయని తేలింది.

ED తన దాడుల్లో ఆయా చోట్ల అనేక ఎలక్ట్రానిక్ డివైస్‌లు, డాక్యుమెంట్‌లు, ఇతర కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకొన్న సాక్ష్యాల ఆధారంగా మరిన్ని అరెస్టులు, ఆస్తుల జప్తు జరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ సహకారంతో దర్యాప్తు మరింత లోతుగా కొనసాగించేందుకు ఈడీ సమాయత్తమవుతోంది. మరోవైపు, ఇటువంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్‌పై కఠిన చర్యలను పరిశీలిస్తోంది.

Updated Date - Aug 06 , 2025 | 08:30 PM