Share News

Himalayas: హిమగిరుల స్వచ్ఛతకు ముప్పు.. కొండల్లా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు..

ABN , Publish Date - May 11 , 2025 | 02:46 PM

Himalayas Plastic Pollution: స్వచ్ఛతకు, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే హిమాలయాల ఉనికి ప్రమాదంలో పడింది. మనోహరమైన మంచుకొండలను ప్లాస్టిక్ భూతం కప్పేస్తోంది. వీటిలో దాదాపు 70% ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే అవకాశమూ లేకపోవడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Himalayas: హిమగిరుల స్వచ్ఛతకు ముప్పు.. కొండల్లా పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు..
Himalayas Plastic Pollution

Single Use Plastic Waste Himalayas: ప్రకృతి అందాలకు స్వర్గధామమైన హిమాలయ పర్వతాల ఉనికి ప్రమాదంలో పడింది. భారతదేశానికి రక్షణ కవచంలా నిలబడి పరిరక్షిస్తున్న హిమగిరులు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఇప్పటికే వాతావరణంలో పెను మార్పుల కారణంగా హిమనీనదాలు వేగంగా కరిగిపోతుంటే.. మరో పక్క ప్లాస్టిక్ భూతమూ మంచు పర్వతాలను చుట్టేస్తోంది. హిమాలయ అందాలను ఆస్వాదించేందుకు వెళుతున్న పర్యాటకులు, స్థానికుల కారణంగా ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కొండల్లా పేరుకుపోతుండటం పర్యావరణ ప్రియులను కలవరపెడుతోంది. స్వచ్ఛతకు, సౌందర్యానికి మారుపేరుగా నిలిచే హిమాలయ పర్వతశ్రేణుల వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలే తారసపడుతుడున్నాయి. వీటిలో దాదాపు 84% సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలే అంటూ ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ చేయలేని ఇలాంటి వ్యర్థాలను మంచు పర్వతాలపై పడేస్తూ చేజేతులా పర్యావరణానికి హాని కలిగిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


70 శాతం రీసైక్లింగ్ చేయలేనివే..

జీరో వేస్ట్ హిమాలయ అలయన్స్ తాజా నివేదిక ప్రకారం, హిమాలయాలలో ఉత్పన్నమయ్యే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలలో 80 శాతానికి పైగా సింగిల్ యూజ్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ వంటి పానీయాల ప్యాకేజింగ్ వ్యర్థాలే ఉన్నాయి. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న హిమాలయ ప్రాంతాల నుంచి సేకరించిన ప్లాస్టిక్‌ల వ్యర్థాలలో దాదాపు 70 శాతం వాటికి మార్కెట్ విలువ లేదు. వాటిని రీసైకిల్ చేయలేము. హిమాచల్‌ప్రదేశ్‌లోని బిర్‌లో జరిగిన జీరో వేస్ట్ హిమాలయ నెట్‌వర్క్ మీట్‌లో ఈ పర్యావరణ సమస్య వెలుగులోకి వచ్చింది. మంచు పర్వతాల పరిరక్షణకు సమర్థవంతమైన విధానాలు లేకపోవడం వల్ల హిమగిరులను కాలుష్య భూతం వేగంగా ఆవహిస్తోంది.

himalayas-plastic.gif


84 శాతం ఈ వ్యర్థాలే..

2025లో తొమ్మిది హిమాలయ రాష్ట్రాలలో సిక్కిం అత్యధికంగా 44% చెత్తను ఉత్పత్తి చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ రెండవ స్థానంలో ఉంది. లడఖ్ వాలంటీర్లు 18 వేర్వేరు ప్రదేశాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించగా, అందులో 84.2 శాతం ఆహారం, పానీయాల ప్యాకేజింగ్ వ్యర్థాలేనని నిరూపితమైంది. మంచు పర్వత అందాలను ఆస్వాదించేందుకు, ట్రెక్కింగ్ కోసం వెళ్తున్న పర్యాటకులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడికక్కడ పడేస్తుండటం ఒకటైతే.. వీటిని తీసివేసేందుకు ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం కూడా హిమాలయాలు ప్లాస్టిక్ నిలయాలుగా మారేందుకు కారణమవుతున్నాయి. ఒక సర్వే ప్రకారం, మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలలో 71 శాతం ఎనర్జీ డ్రింక్స్ ప్యాకెట్లు, ఇన్‌స్టంట్ నూడుల్స్‌ కవర్లు, టైట్రా ప్యాకెట్లే ఉన్నాయి. వీటిని వ్యర్థాలను సేకరించేవారు, స్క్రాప్ డీలర్లు అంగీకరించరు. ఫలితంగా, పర్వతాలపై గుట్టల్లా పేరుకుపోయి నదుల సహజ ప్రవాహాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. నీటి ప్రవాహాలతో పాటు పల్లపు ప్రాంతాలకు చేరి కాలుష్య కారకాలుగా మారుతున్నాయి.


మేల్కొకోకుంటే ముప్పే..

హిమాలయ పర్వతశ్రేణులపై అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్లాస్టిక్ కొండలను కరిగించేందుకు ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లాస్టిక్ ఉత్పత్తి, వాడకంపై నిషేధ చర్యలు కఠినంగా అమలు చేసినపుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ఇదిలాగే కొనసాగితే మాత్రం జీవనదులకు పుట్టినల్లైన హిమగిరుల స్వచ్ఛతకు భంగం వాటిల్లడం తథ్యం. ప్లాస్టిక్ కాలుష్యకోరల్లో పూర్తిగా చిక్కుకుని పర్యావరణ వ్యవస్థ గతి తప్పుతుంది. రుతువుల్లో అనూహ్య మార్పులు వస్తాయి. స్థానికుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుంది. కాబట్టి, ఇప్పటికైనా అందరూ మేల్కొని మంచు కొండలను స్వచ్ఛంగా ఉంచడాన్ని తమ కర్తవ్యంగా భావించాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Read Also: India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

BrahMos Facility: బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ షురూ.. ఏటా 100 క్షిపణులు తయారీ

Updated Date - May 11 , 2025 | 04:15 PM