Share News

Heavy Rains: నగరంలో భారీ వర్షం.. పొంచి ఉన్న వాయు గండం

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:02 AM

నగరంలో, సబర్బన్‌ ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది.గత మూడు రోజులుగా పగటిపూట ఎండవేడి, రాత్రిపూట చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి కుండపోతగా మారింది.

Heavy Rains: నగరంలో భారీ వర్షం.. పొంచి ఉన్న వాయు గండం

చెన్నై: నగరంలో, సబర్బన్‌ ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది.గత మూడు రోజులుగా పగటిపూట ఎండవేడి, రాత్రిపూట చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి కుండపోతగా మారింది. ఎగ్మూరు, పురుషవాక్కం, ప్యారీస్‌ కార్నర్‌, కోయంబేడు, అన్నానగర్‌, ముగపేర్‌(Annanagar, Mugapere), అయనవరం, విల్లివాక్కం, అశోక్‌నగర్‌, మైలాపూరు, చోళవరం, తాంబరం, వండలూరు తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. శనివారం వేకువజాము కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.


కూలిన 17 చెట్లు...

నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు 17 చోట్ల చెట్లు కూలిపడ్డాయి. కార్పొరేషన్‌ కార్మికులు, ఆయా ప్రాంతాల్లోని అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన కూలిన చెట్లను తొలగించారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 25న బంగాళాఖాతంలో అల్పవాయుపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, దాని ప్రభావంతో నగరంలో, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు.


nani1.jpg

రిజర్వాయర్లలో పెరిగిన నీటిమట్టం...

గత మూడు రోజులుగా చెన్నై, తిరువళ్లూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నగరానికి తాగునీటిని సరఫరా చేసే జలాశయాల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. పుళల్‌, పూండి, చోళవరం, కన్నన్‌కోట- తేర్వాయ్‌ కండిగ, చెంబరంబాక్కం జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పూండి రిజర్వాయర్‌లో 3231 మిలియన్ల ఘనపుటడుగుల వరకు నీటిని నిల్వ చేసే అవకాశం ఉండగా శనివారం సాయంత్రం నీటిమట్టం 2351 మిలియన్ల ఘనపుడుగుల మేర పెరిగింది. నగరానికి ఆ జలాశయం నుండి సెకనుకు 297 ఘనపుటడుగులు చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.


పుళల్‌ జలాశయంలో 3330 మిలియన్ల ఘనపుటడుగుల మేర నీరు నిల్వచేసేందుకు వీలుండగా ప్రస్తుతం 2972 మిలియన్ల ఘనపుటడుగుల మేర నీటి మట్టం పెరిగింది. చెంబరంబాక్కంలో నీటిమట్టం 945 మిలియన్ల ఘనపుటడుగుల మేర పెరిగింది. నగరానికి తాగునీటి అవసరాల కోసం సెకనుకు 195 ఘనపుటడుగుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు శనివారం ఉదయం వరకు చోళవరంలో 131 మి.మీ., తిరుత్తణిలో 131 మి.మీ, తిరువళ్లూరులో 113 మి.మీ, తామరైపాక్కంలో 83 మి.మీ. గుమ్మిడిపూండిలో 55 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రెడ్‌హిల్స్‌లో 48 మి.మీ., పూందమల్లిలో 62 మి.మీ., ఊత్తుకోటలో 43 మి.మీ., ఆవడిలో 40 మి.మీ., పొన్నేరిలో 38 మి.మీ. వర్షపాతం నమోదైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరల్లో పెరుగుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 24 , 2025 | 11:02 AM