Heavy Rains: ఈశాన్యం ఉగ్రరూపం.. మూడురోజులుగా ముప్పుతిప్పలు
ABN , Publish Date - Oct 20 , 2025 | 11:42 AM
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన మూడు రోజులకే ఉగ్రరూపం దాల్చటంతో చెన్నై(Chennai) పరిసర జిల్లాల్లో, కావేరి డెల్టా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో శనివారం కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
చెన్నై: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన మూడు రోజులకే ఉగ్రరూపం దాల్చటంతో చెన్నై(Chennai) పరిసర జిల్లాల్లో, కావేరి డెల్టా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో శనివారం కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, ఈరోడ్, తేని, విరుదునగర్, రామనాధపురం, తూత్తుకుడి, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్నియాకుమారి జిల్లాల్లో ఆదివారం వేకువజామున చిరుజల్లులతో ప్రారంభమైన వర్షాలు మధ్యాహ్నానికి కుండపోతగా మారాయి. దీంతో నీలగిరి(Neelagiri) సహా 11 జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ దీవుల్లా మారాయి. రోడ్లపై వర్షపునీరు ప్రవహించగా, పెనుగాలులకు చెట్లు కూలిపడ్డాయి.

ముఖ్యంగా ఊటీ - కున్నూరు మధ్య ఏడు ప్రాంతాల్లోని రహదారులపై భారీ వృక్షాలు కూలిపడ్డాయి. తేని, రామనాధపురం, కన్నియాకుమారి జిల్లాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. రానున్న పది రోజుల్లో బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడనుండటంతో వారంరోజుల వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు చెబుతున్నారు. ముందే రానున్న అల్పపీడన ప్రభావంతోనూ భారీగా వర్షాలు కురవనున్నాయి. సోమవారం 18 జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

ఆ మేరకు కోవై, నీలగిరి, తిరుప్పూరు, ఈరోడ్, దిండుగల్, తేని, మదురై, విరుదునగర్, రామనాధపురం, శివగంగ, పుదుకోట, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. మంగళవారం చెన్నై, చెంగల్పట్టు సహా 12 జిల్లాల్లో, బుధవారం చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం సహా 16 జిల్లాల్లో, గురువారం చెన్నై, వేలూరు, తిరువళ్లూరు, కాంచీపురం సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఇదే విధంగా ఈ నెల 24, 25 తేదీలలోనూ మరికొన్ని జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఊటీ కొండ రైలు రద్దు...
నీలగిరి జిల్లా ఊటీ, కున్నూరు, కొత్తగిరి పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు మేట్టుపాళయం - కున్నూరు రైలు మార్గంలో పలు చోట్ల బండరాళ్లు, మట్టి పెళ్లలు జారి పడ్డాయి. దీంతో ఆదివారం మేట్టుపాళయం - కున్నూరు, కున్నూరు - ఊటీ మధ్య కొండ రైలు సర్వీసు రద్దయ్యింది. అదే సమయంలో పట్టాలపై పడిన బండరాళ్లు, మట్టిపెళ్లలను రైల్వే కార్మికులు తొలగించారు. వర్షంతోపాటు పెనుగాలులు తోడవడంతో ఊటీలో ఏడు చోట్ల చెట్లు కూలిపడ్డాయి. అగ్నిమాపక శాఖ, హైవేస్ శాఖల సిబ్బంది చెట్లను తొలగించారు.

జలదిగ్బంధంలో ఇళ్లు...
కున్నూరు పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు దీవులుగా మారాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరంతా రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కున్నూరు రైతు బజారు సమీపంలోని మాడల్‌హౌస్ ప్రాంతం వద్ద మూడోసారి ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. ఈ సమాచారం అందుకున్న కార్పొరేషన్ అధికారులు హుటాహుటిన ఇళ్ళలో చేరిన వర్షపునీటిని తొలగించారు. ఆట్టి డాల్ఫిన్ నో్‌స, కరుపాలం, క్లిండేల్ ప్రాంతాల్లో రహదారులపై చెట్లు కూలిపడటంతో వాటిని కార్మికులు తొలగించచారు. కున్నూరు - కట్టబెట్టు రహదారిలోని వండిసోలై, కొడనాడు ప్రాంతాల్లోని రోడ్లపై బండరాళ్లు జారిడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది.
రాజధానిలో...
రాజధాని నగరం చెన్నైలో శనివారం రాత్రి పది గంటల నుండి ఆదివారం వేకువజాము వరకూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాయపేట, చేపాక్, ట్రిప్లికేన్, టి.నగర్, పురుషవాక్కం, అడయార్, తాంబరం, ఆవడి, అంబత్తూరు, మధురవాయల్, కోయంబేడు, సైదాపేట, ప్యారీస్ కార్నర్, రాయపురం తదితర ప్రాంతాల్లో వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహన చోధకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
జాలర్లకు హెచ్చరిక...
ఇదిలా ఉండగా ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చటంతో వచ్చే ఐదురోజులు జాలర్లు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం దక్షిణ మండల అధికారి అముద తెలిపారు. రాష్ట్రంలో, పుదుచ్చేరిలో మరో నాలుగు రోజులపాటు భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. మన్నార్ జలసంధి, కన్నియకుమారి తదితర ప్రాంతాల్లో పెనుగాలులు వీచే అవకాశం ఉండటంతో జాలర్లు ఐదు రోజులు చేపలవేటకు స్వస్తి పలకాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ నెల 23న నగరంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసినట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి
Read Latest Telangana News and National News