Heavy Rainfall: ఈ ప్రాంతాలకు రెయిన్ అలర్ట్..ప్రమాద స్థాయికి చేరుకున్న నదులు
ABN , Publish Date - Aug 10 , 2025 | 08:45 AM
ఉత్తర భారతదేశంలో వర్షాల ప్రభావం పెరిగింది, కొన్ని ప్రాంతాల్లో నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర భారతంలో కూడా వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఓవైపు చల్లదనం తీసుకొచ్చినా, మరోవైపు జీవనోపాధులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీ-NCRతో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ వర్షాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. వానల కారణంగా రోడ్లపై నీళ్లు, ట్రాఫిక్ జామ్‌లు, నదుల్లో వరదలు ఇలా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీ వాళ్లకు ఈ శనివారం ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎందుకంటే, గత 14 ఏళ్లలో ఆగస్ట్‌లో అత్యంత చల్లని రోజు ఇదే. ఉష్ణోగ్రత 26.4°C వరకు పడిపోయింది. అది కూడా సాధారణం కంటే 7.8°C తక్కువ.
ఈసారి అది కూడా ..
2011 నుంచి చూస్తే, 2012లో 27.9°C రికార్డ్ అయింది, కానీ ఈసారి అది కూడా బ్రేక్ అయ్యింది. కానీ, ఈ చల్లదనం ఆనందం తెచ్చినా, వర్షం వల్ల రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ జామ్‌లు తెగ ఇబ్బంది పెట్టాయి. ఢిల్లీ-NCRలో శనివారం రోజంతా చిన్న చిన్న వర్షాలు కురిశాయి, దీంతో రోడ్లు జలమయం అయ్యాయి.
ఈ రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
IMD ప్రకారం ఆదివారం జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ-NCR, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో, ఈ రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచే చాన్స్ ఎక్కువ, కాబట్టి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి.
ఉత్తరప్రదేశ్‌లో నదులు ఉగ్రరూపం
పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఉత్తరప్రదేశ్‌లో నదులు ప్రమాద స్థాయికి చేరాయి. చందౌలీ, మౌ, ఫరూఖాబాద్, కన్నౌజ్, హాపూర్‌లలో నదుల నీటి మట్టం డేంజర్ లెవెల్‌కి వచ్చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్లను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. అధికారులు అలర్ట్ జారీ చేశారు, కాబట్టి నదుల దగ్గర ఉండేవాళ్లు జాగ్రత్తగా ఉండండి.
బీహార్‌లో గంగా, బూధి గండక్ వరదలు
బీహార్‌లో కూడా వర్షాలు, వరదలు గట్టిగా ఇబ్బంది పెడుతున్నాయి. గంగా, బూధి గండక్ నదుల నీరు చాలా ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చింది. ఖగరియా జిల్లాలో గంగా నది ఖరా ధర్ జల్ద్వార్ వద్ద ప్రమాద స్థాయి కంటే 2 మీటర్ల 4 సెంటీమీటర్లు ఎక్కువగా ప్రవహిస్తోంది. అలాగే, బూధి గండక్ నది NH-31 బ్రిడ్జ్ (అఘోరి లొకేషన్) వద్ద 1 మీటర్ 73 సెంటీమీటర్లు డేంజర్ మార్క్‌ను దాటింది. దీంతో జిల్లాలో 17 పంచాయతీలు వరదల బారిన పడ్డాయి. ఇక్కడ కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
యమునా నది డేంజర్
ఢిల్లీలో యమునా నది నీటి మట్టం కూడా హఠాత్తుగా పెరిగిపోతోంది. హథినీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. అధికారులు వెంటనే అలర్ట్ అయ్యి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్లను సురక్షిత ప్రదేశాలకు తరలించే పనిలో పడ్డారు. యమునా నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. మీ పిల్లలు, కుటుంబ సభ్యులతో సురక్షిత ప్రదేశాలకు వెళ్లండి అంటూ లౌడ్‌స్పీకర్లలో అనౌన్స్‌మెంట్స్ ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి