Padmanabhaswamy Temple: కెమెరా కళ్లద్దాలతో పద్మనాభ స్వామి ఆలయంలోకి వెళ్లేందుకు యత్నం
ABN , Publish Date - Jul 07 , 2025 | 11:06 PM
సీక్రెట్ కెమెరాలున్న కళ్లద్దాలు ధరించి కెరళ శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడో గుజరాత్ వ్యక్తి. దీన్ని ముందుగానే పసిగట్టిన సిబ్బంది అతడిని అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సీక్రెట్ కెమెరాలున్న స్మార్ట్ కళ్లద్దాలు ధరించి కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని గుజరాత్‌కు చెందిన సురేంద్ర షా (66) గుర్తించారు.
సురేంద్ర షా తన భార్య, సోదరి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి దేవాలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ధరించిన స్మార్ట్ కళ్లద్దాల్లో సీక్రెట్ కెమెరాలు ఉన్న విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. దేవాలయం ఎంట్రన్స్ వద్దే ఆయనను అడ్డుకున్నారు. ఆ తరువాత సిబ్బంది కళ్లద్దాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాటిలో ఎవరికీ కనిపించని విధంగా కెమెరాలు అమర్చినట్టు గుర్తించారు. ఇది దేవాలయ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు.
ఈ క్రమంలో పోలీసులు షాను అదుపులోకి తీసుకుని భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223 (ప్రభుత్వ అధికారుల ఆదేశాలను కావాలని ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేశారు. ఆయనను తన కుటుంబసభ్యులతో కలిసి స్వస్థలానికి వెళ్లేందుకు అనుమతించిన పోలీసులు మళ్లీ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. సురేంద్రకు దురుద్దేశమేదీ లేదని ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ దర్యాప్తు మాత్రం కొనసాగుతుందని అన్నారు.
గత నెలలో ఆలయంలో నిర్వహించిన మహా కుంభాభిషేకాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా పోటెత్తిన విషయం తెలిసిందే. దాదాపు 270 ఏళ్ల తరువాత జరిగిన ఈ వేడుకకు భక్తులు భారీగా తరలివచ్చారు. కుంభాభిషేకంతో పాటు 300 ఏళ్ల నాటి విశ్వక్సేనుడి విగ్రహ పునఃప్రతిష్ఠ, తిరువంబాడి శ్రీ కృష్ణ స్వామి ఆలయంలో అష్టబంధ కలశం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
మహారాష్ట్రలో కలకలం.. ఎమ్ఎన్ఎస్ నేత కుమారుడు మద్యం మత్తులో అర్ధ నగ్నంగా..
బిహార్‌లో షాకింగ్ ఘటన.. టీచర్‌ను కర్రతో కొట్టిన తల్లిదండ్రులు.. వీడియో వైరల్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి