Rahil Sheikh: మహారాష్ట్రలో కలకలం.. ఎమ్ఎన్ఎస్ నేత కుమారుడు మద్యం మత్తులో అర్ధ నగ్నంగా..
ABN , Publish Date - Jul 07 , 2025 | 07:27 PM
మహారాష్ట్రలో ఎమ్ఎన్ఎస్ పార్టీ నేత కుమారుడు ఒకరు మద్యం మత్తులో అర్ధనగ్నంగా మరాఠీ మహిళపై నోరుపారేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో మరాఠీయేతరులపై దాడులు కలకలం రేపుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనను (ఎమ్ఎన్‌ఎస్) చిక్కుల్లోకి నెట్టే మరో వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎమ్ఎన్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావేద్ షేఖ్ కుమారుడు రాహిల్ షేఖ్ మద్యం మత్తులో అర్ధ నగ్నంగా ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన వైనం వివాదానికి దారి తీసింది. తన తండ్రి పవర్‌ఫుల్ అంటూ రాహిల్ మహిళను బెదిరించే ప్రయత్నం చేసినట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో, పోలీసులు రాహిల్‌ను అరెస్టు చేశారు. మహిళలను అగౌరవ పరచడం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ అభియోగాలతో కేసు నమోదు చేశారు (MNS Leader Son Rahil Sheikh).
నెట్టింట వైరల్‌గా మారిన రాహిల్ వీడియోను రీపోస్టు చేసిన శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఎమ్ఎన్ఎస్ తీరును ఎండగట్టారు. మరాఠీ సంస్కృతికి పరిరక్షకులమని చెప్పుకునే వారి నిజస్వరూపం ఇదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మద్యం మత్తులో తానేం చేస్తున్నదీ గుర్తించలేని స్థితిలో ఓ ఎమ్ఎన్ఎస్ నేత తనయుడు మరాఠీ మహిళను దుర్భాషలాడాడు.
ఇది చాలదన్నట్టు తన తండ్రి రాజకీయ పలుకుబడిని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. మరాఠీ ఆత్మగౌరవానికి పరిరక్షకులమని చెప్పుకునే వారి నిజస్వరూపం ఇదీ. వీళ్లు భాష పేరిట రౌడీయిజం తప్ప మరేమీ చేయట్లేదు. ఎమ్ఎన్ఎస్ క్షేత్ర స్థాయి పరిస్థితి ఇది. మా ప్రభుత్వం మరాఠీకి వ్యతిరేకం ఏమీ కాదు. మేమే భాషను ప్రోత్సహిస్తున్నాము’ అని అన్నారు. మరాఠీయేతరులపై ఎమ్ఎన్ఎస్ వర్కర్లు దాడికి దిగిన ఘటనలు ఇటీవల వెలుగు చూసిన నేపథ్యంలో తాజా ఉదంతం మరింత కలకలం రేపుతోంది.
ఇక ఈ వివాదానికి ఎమ్ఎన్ఎస్ దూరం జరిగే ప్రయత్నం చేసింది. ఈ చర్యలను పార్టీ అస్సలు సమర్థించదని ఎమ్ఎన్ఎస్ నేత అవినాశ్ జాదవ్ స్పష్టం చేశారు. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఇవి కూడా చదవండి:
బిహార్‌లో షాకింగ్ ఘటన.. టీచర్‌ను కర్రతో కొట్టిన తల్లిదండ్రులు.. వీడియో వైరల్
ఒక్క రోజు కూడా పని చేయని కానిస్టేబుల్‌కు రూ.28 లక్షల జీతం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి