Share News

MP Absentee Cop: ఒక్క రోజు కూడా పని చేయని కానిస్టేబుల్‌కు రూ.28 లక్షల జీతం

ABN , Publish Date - Jul 06 , 2025 | 07:33 PM

ఒక్క రోజు కూడా డ్యూటీకి రాని ఓ పోలీసు కానిస్టేబుల్ పన్నెండేళ్ల పాటు ఏకంగా రూ.28 లక్షలను జీతం కింద తీసుకున్న ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. డిపార్ట్‌మెంట్‌లో కలకలానికి దారి తీసింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తప్పవని పోలీసు అధికారులు తెలిపారు.

MP Absentee Cop: ఒక్క రోజు కూడా పని చేయని కానిస్టేబుల్‌కు రూ.28 లక్షల జీతం
Rs 28 lakh Cop salary without work

ఇంటర్నెట్ డెస్క్: అతడు పుష్కరకాలం క్రితం పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ డ్యూటీలో మాత్రం చేరలేదు. కనీసం ట్రెయినింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. జీతం మాత్రం పుచ్చుకుంటూనే ఉన్నాడు. ఇప్పటివరకూ అతడికి శాలరీ కింద రూ.28 లక్షలు అందింది. మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

అసలు ఏం జరిగిందనే వివరాలను ఏసీపీ ఖతేర్కర్ మీడియాకు తెలిపారు. ‘ఆ కానిస్టేబుల్ 2011లో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. నిబంధనల ప్రకారం, అతడు తన బ్యాచ్‌ మేట్స్‌తో కలిసి ట్రెయినింగ్ పూర్తి చేసుకోవాలి. కానీ అతడికి వ్యక్తిగత కారణాల రీత్యా వేరుగా ట్రెయినింగ్‌లో చేరేందుకు అనుమతి లభించింది. ఈలోపు అతడి బ్యాచ్ మేట్స్ అందరూ ట్రెయినింగ్ పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. కానీ ఆ కానిస్టేబుల్ మాత్రం అసలు ట్రెయినింగ్‌కే వెళ్లలేదు. అతడి వివరాలేవీ రికార్డులకూ ఎక్కలేదు’


‘ట్రెయినింగ్ పూర్తి చేసుకోకపోయినా యాక్టివ్ డ్యూటీలో చేరకపోయినా కూడా రికార్డుల్లో మాత్రం అతడి పేరు ట్రెయినీ కానిస్టేబుల్‌గా కొనసాగింది. దీంతో, అతడికి రెగ్యులర్‌గా జీతం కూడా అందింది. 12 ఏళ్ల తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పే గ్రేడ్ ఎవాల్యుయేషన్‌లో భాగంగా అతడి రికార్డులను తనిఖీ చేసినప్పుడు విషయం బయటపడింది’ అని ఏసీపీ తెలిపారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, విచారణ చేపట్టిన పోలీసులకు అసలు ఆ కానిస్టేబుల్ ఎక్కడున్నదీ తొలుత అర్థం కాలేదు. డిపార్ట్‌మెంట్‌లోని వారెవరూ అతడిని గుర్తించలేకపోయారు. అంతర్గత విచారణలో అతడి పాత రికార్డులు, సర్వీసు రిటర్న్‌లు ఏవీ కనిపించలేదు. పన్నెండేళ్లుగా పని చేస్తున్న కానిస్టేబుల్‌‌కు ఒక్క కేసు కూడా అప్పగించినట్టు రికార్డులు లేకపోవడం పోలీసులను ఆశ్చర్యపరిచింది.

ఈ క్రమంలో అతడిని పిలిపించి ప్రశ్నించగా తనకు మానసిక సమస్యలు ఉన్నట్టు అతడు తెలిపాడు. తన వాదనకు ఆధారాలుగా పలు డాక్యుమెంట్స్‌ను కూడా సమర్పించాడు. తన పరిస్థితి కారణంగా ఇంత కాలం డ్యూటీలోకి రాలేకపోయానని అన్నాడు. మొదట్లో తనకు పోలీసు నిబంధనలపై కూడా అంతగా అవగాహన లేకపోయిందని అన్నాడు. ఈ విషయాల్లో తనకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, ఆరోగ్యం సహకరించక పోవడంతో విధులకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపాడు.


ఇప్పటివరకూ సదరు కానిస్టేబుల్ డిపార్ట్‌మెంట్‌కు రూ.1.5 లక్షలు తిరిగి ఇచ్చినట్టు ఏసీపీ తెలిపారు. మిగిలిన మొత్తాన్ని తనకు భవిష్యత్తులో లభించే శాలరీ నుంచి కట్ చేసుకోవాలని చెప్పినట్టు తెలిపారు. ఈ విషయంలో విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సంబంధిత అధికారులందరినీ ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇవి కూడా చదవండి:

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోలీస్ అకాడమీలో చేరి.. రెండేళ్ల పాటు..

అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. దేశ ప్రయోజనాలే ముఖ్యమన్న కేంద్ర మంత్రి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 07:39 PM