Share News

Parents Beat Teacher: బిహార్‌లో షాకింగ్ ఘటన.. టీచర్‌ను కర్రతో కొట్టిన తల్లిదండ్రులు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 06 , 2025 | 09:15 PM

బిహార్‌లో ఓ టీచర్‌ను విద్యార్థి తల్లిదండ్రులు చావబాదిన ఘటన కలకలం రేపుతోంది. తమ కుమారుడిపై చేయి చేసుకున్నందుకు టీచర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Parents Beat Teacher: బిహార్‌లో షాకింగ్ ఘటన.. టీచర్‌ను కర్రతో కొట్టిన తల్లిదండ్రులు.. వీడియో వైరల్
Bihar Teacher Beaten By Parents

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. విద్యార్థిపై చేయి చేసుకున్న ఓ టీచర్‌పై బాలుడి తల్లిదండ్రులు కర్రలతో దాడి చేశారు. ఇతర టీచర్లు వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ జనాలను షాక్‌కు గురి చేస్తోంది (Bihar Teacher Beaten By Parents).

జాతీయ మీడియా కథనాల ప్రకారం, గయ జిల్లాలో ఈ ఘటన జరిగింది. క్లాసులో ఐదో తరగతి విద్యార్థులు ఇద్దరు గొడవ పడుతున్న విషయాన్ని రాకేశ్ రంజన్ శ్రీవాత్సవ అనే టీచర్‌కు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. దీంతో హుటాహుటిన క్లాసులోకి వచ్చిన రాకేశ్.. విద్యార్థుల చెంపలు ఛెళ్లుమనిపించారు. దీంతో గొడవ ముగిసిపోయినప్పటికీ ఓ విద్యార్థి ఇంటికెళ్లి టీచర్‌ తనను కొట్టిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు.


దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన బాలుడి తల్లిదండ్రులు స్కూలుకు వచ్చి నానా యాగీ చేశారు. క్లాసులు జరుగుతుండగానే రణరంగం సృష్టించారు. తమ కుమారుడిపై చేయి చేసుకున్న రాకేశ్ కనిపించగానే మరింతగా రెచ్చిపోయారు. అతడి చెంప పగలగొట్టి ముష్టిఘాతాలు కురిపించారు. వెంట పడి కర్రతో దాడి చేశారు. రాకేశ్‌పై దాడి చేయొద్దని ఓ మహిళా టీచర్ వేడుకున్నా లక్ష్య పెట్టకుండా దాడికి దిగారు. ఈ దృశ్యాలు చూసి స్కూల్లోని వారందరూ హడలిపోయి చెల్లాచెదురుగా పారిపోయారు. కాగా, పేరెంట్స్ దాడిలో రాకేశ్‌తోపాటు మరో టీచర్ ధర్మేంద్ర కుమార్‌కు గాయాలయ్యాయి.

ఇక విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయాలపాలైన రాకేశ్, ధర్మేంద్రలను ఆసుపత్రికి తరలించారు. బాధిత టీచర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


ఈ ఉదంతంపై పాఠశాల హెడ్‌మాస్టర్ పంకజ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని విద్యావ్యవస్థపై దాడిగా అభివర్ణించారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు టీచర్ల భద్రత కూడా తమకు ముఖ్యమేనని అన్నారు. ఈ దారుణానికి తెగబడ్డ వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

ఒక్క రోజు కూడా పని చేయని కానిస్టేబుల్‌కు రూ.28 లక్షల జీతం

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పోలీస్ అకాడమీలో చేరి.. రెండేళ్ల పాటు..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 09:43 PM