Share News

GST Relief Health Life Insurance: బీమాపై ధీమా!

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:08 AM

అడ్డగోలు వైద్య ఖర్చులతో కుటుంబాలు కుదేలవకుండా తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య బీమా అందబోతోంది. అనుకోనిదేదైనా జరిగితే కుటుంబాలు రోడ్డునపడకుండా ఆదుకునే జీవిత బీమాకు అయ్యే వ్యయం తగ్గబోతోంది.

GST Relief Health Life Insurance: బీమాపై ధీమా!

  • ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు

  • జీఎస్టీ కౌన్సిల్‌కు మంత్రుల బృందం సిఫారసు

  • పాలసీల ప్రీమియం ఒక్కసారిగా 18% తగ్గే చాన్స్‌

  • మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట

  • ఆరోగ్య, టర్మ్‌ పాలసీలకు పూర్తి ప్రయోజనం

  • పెట్టుబడుల తరహా సాధారణ, యులిప్‌ పాలసీల విషయంలో ‘రిస్క్‌’ మేరకే మినహాయింపు

  • జీఎస్టీలో ఇకపై రెండు శ్లాబులే!

  • ప్రస్తుత 4 పన్ను శ్లాబులను 5%, 18%కు కుదించే ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఓకే

  • జీఎస్టీ కౌన్సిల్‌ తుది నిర్ణయమే తరువాయి

  • 90 శాతం నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం

  • దిగిరానున్న గృహోపకరణాలు, వాహనాల ధరలు

  • దీపావళికల్లా అమల్లోకి తెచ్చేలా కేంద్రం చర్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 21: అడ్డగోలు వైద్య ఖర్చులతో కుటుంబాలు కుదేలవకుండా తక్కువ ప్రీమియంతోనే ఆరోగ్య బీమా అందబోతోంది. అనుకోనిదేదైనా జరిగితే కుటుంబాలు రోడ్డునపడకుండా ఆదుకునే జీవిత బీమాకు అయ్యే వ్యయం తగ్గబోతోంది. ఏళ్ల నుంచీ ఉన్న బీమా ప్రీమియంలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపు డిమాండ్‌ తీరబోతోంది. మధ్య తరగతి జీవితాలకు ఊరట కలగబోతోంది. దేశంలో బీమా ప్రీమియంలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని జీఎస్టీ హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం తాజాగా సిఫారసు చేసింది. ఇది అమల్లోకి వస్తే దేశంలో ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలు ఒక్కసారిగా 18శాతం వరకు తగ్గేందుకు అవకాశముంది. దీనికితోడు జీఎస్టీ నుంచి పేద, మధ్యతరగతి వర్గాలకు ఉపశమనం లభించేదిశగా మరో ముందడుగు పడింది. జీఎస్టీ నాలుగు పన్ను రేట్లను రెండు శ్లాబుల (5ు, 18ు)కు కుదించే ప్రతిపాదనలను మంత్రుల బృందం ఆమోదించింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్‌ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెలలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపు ప్రతిపాదనలపై చర్చించి.. అవసరమైన మార్పు చేర్పులు చేసి, ఆమోదించనుంది. దీపావళికి ప్రత్యేక బహుమతి ఇస్తానన్న ప్రధాని మోదీ ప్రకటనకు అనుగుణంగా.. ఆలోగానే ఈ మార్పులన్నీ అమల్లోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దేశంలో సాధారణ ప్రజలపై పన్ను భారం తగ్గించడం, జీఎస్టీ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ చేపట్టనున్నట్టు ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి కన్వీనర్‌గా ఏర్పాటు చేసిన ఆరుగురు మంత్రుల బృందం పలు ప్రతిపాదనలను పరిశీలించి, ఆమోదించింది. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28ు శ్లాబులు ఉండగా.. ఇందులో 12%, 28% శ్లాబులను పూర్తిగా ఎత్తివేసి, వాటి పరిధిలో ఉన్న వస్తుసేవలను 5%, 18% పన్ను రేట్లలోకి సర్దుబాటు చేయనున్నారు. ఇక కొన్నిరకాల విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై 40శాతం ప్రత్యేక పన్నును వసూలు చేస్తారు.


బీమా పాలసీలపై పూర్తిగా పన్ను ఎత్తివేత..!

జీఎస్టీ శ్లాబులను రెండుకు కుదించే కేంద్ర ప్రతిపాదనలను మంత్రుల బృందం ఆమోదించిందని సామ్రాట్‌ చౌదరి వెల్లడించారు. వ్యక్తిగత ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్‌కు సిఫార్సు చేశామని తెలిపారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంపై 18శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీనిని పూర్తిగా ఎత్తివేస్తే పాలసీల ప్రీమియం ఖర్చు ఒక్కసారిగా దిగివస్తుందని, మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత కలుగుతాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక విలాసవంతమైన కార్లు, సిగరెట్లు వంటి హానికర ఉత్పత్తులను 40శాతం పన్ను రేటులో చేర్చాలని ప్రతిపాదించినట్టు యూపీ ఆర్థిక మంత్రి సురేశ్‌కుమార్‌ ఖన్నా తెలిపారు. పన్ను రేట్లలో మార్పుల వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయి, తిరిగి ప్రజల సంక్షేమంపై ప్రభావం పడుతుందని.. తగ్గే ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలని కోరుతున్నామని బెంగాల్‌ ఆర్థిక మంత్రి చంద్రిమ భట్టాచార్య వెల్లడించారు.

90శాతం నిత్యావసరాలు చవక!

ప్రస్తుతం 12శాతం శ్లాబులో ఉన్న నిత్యావసరాల్లో 90శాతానికిపైగా 5శాతం పన్నురేటుకు మారుతాయని, దీనితో నిత్యావసరాల ధరలు తగ్గుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 28శాతం శ్లాబులో ఉన్న గృహోపకరణాలు, వాహనాల్లో చాలా వరకు 18శాతం పన్నురేటుకు మారుతాయని, దీనితో వాటి ధరలూ తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.


బీమాపై జీఎస్టీ మినహాయింపుతో ప్రయోజనమెంత?

ప్రస్తుతం బీమా పాలసీల ప్రీమియంపై 18శాతం జీఎస్టీ ఉంది. బీమా కంపెనీలు ఈ పన్ను మొత్తాన్ని కలిపి ప్రీమియం చార్జీలను నిర్ధారించి, వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు జీఎస్టీ మినహాయిస్తే.. ఆ మేరకు ప్రీమియం చార్జీలను తగ్గించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.ఐదు లక్షల ఆరోగ్య బీమా పాలసీకి ఏడాది ప్రీమియం రూ.20 వేలు అయితే.. కంపెనీలు జీఎస్టీ కలిపి రూ.23,600 వినియోగదారు నుంచి వసూలు చేస్తాయి. రూ.3,600 జీఎస్టీని ప్రభుత్వానికి జమ చేస్తాయి. ఇప్పుడు జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తే.. వినియోగదారుల నుంచి రూ.20 వేలు ప్రీమియం మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే బీమా కంపెనీలు పన్ను మినహాయింపు మొత్తాన్ని వినియోగదారులకు అందిస్తాయా? లేక ఏదో ఒక అదనపు సేవ అనో, బీమా మొత్తాన్ని పెంచుతామనో చెప్పి ప్రీమియం తగ్గించుకుండా ఉంటాయా? అన్న సందేహాలు నెలకొన్నాయని పన్నుల నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీమా కంపెనీలు పన్ను మినహాయింపు మొత్తాన్ని తప్పనిసరిగా వినియోగదారులకు బదలాయించేలా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. కాగా, ఎల్‌ఐసీలోని ఎండోమెంట్‌, యాన్యుటీ, పెన్షన్‌తో కూడిన బీమా పథకాలకు జీఎస్టీ రేట్లు విడిగా, వేర్వేరుగా (4.5ు, 2.5ు, 1.8ు) ఉన్నాయి. వాటి విషయంలో ఎలా వ్యవహరించాలన్నది జీఎస్టీ కౌన్సిల్‌ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.


సాధారణ పాలసీలకు మినహాయింపు ఉండదా?

మరోవైపు ఆరోగ్య బీమా, టెర్మ్‌ పాలసీల (కట్టిన సొమ్మును తిరిగివ్వకుండా, తక్కువ ప్రీమియంతోనే అత్యధిక బీమా కల్పించే పాలసీల)కు మాత్రమే మినహాయింపును వర్తింపజేయవచ్చని.. పెట్టుబడుల తరహాలో చేసే సాధారణ జీవిత బీమా, యూలి్‌పల వంటి పాలసీలకు వర్తింపజేయకపోవచ్చని పన్నుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వర్తింపజేసినా.. ఆ పాలసీల ప్రీమియంలో పెట్టుబడికి కాకుండా ‘రిస్క్‌’ కవరేజీ కింద ఉండే మొత్తాన్ని మాత్రమే మినహాయించవచ్చని ధ్రువ అడ్వైజర్స్‌ పార్ట్‌నర్‌ నిపుణుడు జిగ్నేష్‌ ఘెలాని తెలిపారు. ఇక బీమా కంపెనీలు పూర్తిగా 18శాతం మినహాయింపును వినియోగదారులకు బదిలీ చేయకపోవచ్చని.. పాలసీ నిర్వహణ వ్యయాలు, కమీషన్లపై చెల్లించే జీఎస్టీ భారాన్ని వినియోగదారులపైనే వేయవచ్చని ఈవై ఇండియా ట్యాక్స్‌ పార్ట్‌నర్‌ సంస్థ నిపుణుడు సౌరభ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కంపెనీలు చెల్లించే పన్నులకు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఇస్తే.. ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు పూర్తి ప్రయోజనం వినియోగదారులకు అందుతుందని తెలిపారు. అలాకాకున్నా కనీసం 15శాతం వరకు ప్రీమియం చార్జీలు తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 22 , 2025 | 05:08 AM