Share News

Supreme Court: గవర్నర్లు జడ్జిలు కాదు

ABN , Publish Date - Aug 29 , 2025 | 03:09 AM

శాసనసభ ఆమోదించిన బిల్లు రాజ్యాంగబద్ధమా, కేంద్ర ప్రభుత్వ చట్టానికి విరుద్ధమా అని చూడాల్సిన బాధ్యత గవర్నర్‌కులేదని తమిళనాడు ప్రభుత్వం వాదించింది...

Supreme Court: గవర్నర్లు జడ్జిలు కాదు

  • బిల్లులపై న్యాయ సమీక్ష వాళ్ల పని కాదు

  • తమిళనాడు తరఫున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు

న్యూఢిల్లీ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఆమోదించిన బిల్లు రాజ్యాంగబద్ధమా, కేంద్ర ప్రభుత్వ చట్టానికి విరుద్ధమా? అని చూడాల్సిన బాధ్యత గవర్నర్‌కులేదని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. గవర్నర్‌ రాజ్యాంగ ప్రతినిధి మాత్రమేనని, ఆయన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తికాదని స్పష్టం చేసింది. ఆ అధికారాలు న్యాయస్థానాలకు మాత్రమే పరిమితమని గుర్తు చేసింది. శాసనసభ పంపిన బిల్లును గవర్నర్‌ ఆపితే తిరిగి శాసనసభకు పంపాలని, నిర్ణయం తీసుకోకుండా తన దగ్గర పెట్టుకోవడం కుదరదని చెప్పింది. శాసనసభ ఆమోదించిన ద్రవ్య బిల్లులను ఆమోదించకుండా గవర్నర్‌ నిలిపివేస్తే ఆయన సూపర్‌ చీఫ్‌ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారని భావించవచ్చునని గురువారం సుప్రీంకోర్టు ముందు వాదనల్లో పేర్కొంది. రాజ్యాంగంలోని 143 అధికరణ కింద రాష్ట్రపతి, గవర్నర్‌ అధికారాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీం ముందు లేవనెత్తిన ప్రశ్నలపై రాజ్యాంగ ధర్మాసనం ముందు జరుగుతున్న విచారణలో భాగంగా తమిళనాడు తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ద్రవ్య బిల్లులను కూడా గవర్నర్‌ నిరాకరించవచ్చునని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హరీష్‌ సాల్వే, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వ్యాఖ్యలకు సింఘ్వీ సమాధానమిచ్చారు. బిల్లులపై తుది నిర్ణయం ఎన్నికైన ప్రజా ప్రభుత్వానిదికాకుండా గవర్నర్‌దేనని రాజ్యాంగంలో ఎక్కడపేర్కొన్నారో చూపాలని అడిగారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడులో చాలాకాలం నిలిపివేసిన పలు ఉదంతాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్‌ అధికారాలకు సంబంధించిన 207 అధికరణలో చెప్పిన అంశా లు ప్రైవేటు సభ్యుల మనీ బిల్లులకే వర్తిస్తుందని, వాటిని నివారించేందుకే ఈ అధికరణను చేర్చారని ఆయన తెలిపారు. ఇతర అన్ని రకాల బిల్లుల విషయం లో గవర్నర్‌ మంత్రివర్గ ఆమోదంమేరకే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. గవర్నర్‌, రాష్ట్రపతి లాంఛనప్రాయ రాజ్యాంగ అధినేతలని, కొన్ని సందర్భాల్లో తప్ప ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం వారికి లేదన్నారు. 200 అధికరణ ప్రకారం.. గవర్నర్‌ తొలుత ఆమోదాన్ని నిలిపివేసినప్పుడు శాసనసభకు మాత్రమే తిరిగి పంపాలని తెలిపారు. శాశ్వతంగా ఏ బిల్లు నూ నిలిపివేసే అధికారం గవర్నర్‌కులేదన్నారు. విచారణ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌ గవాయి వ్యాఖ్యానిస్తూ..సాధ్యమైనంత త్వరలో అంటేనే వేగంగా నిర్ణయం తీసుకోవాలనే రాజ్యాంగ లక్షాన్ని అది స్పష్టీకరిస్తోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఏర్పడిన వివాదం కేసులోనూ ఉన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని స్పష్టీకరించిందని గుర్తు చేశారు. నిరవధికంగా బిల్లును ఆమోదించకుండా నిలిపివేసే హక్కు గవర్నర్‌కు లేదన్నారు.


ఇవి కూడా చదవండి

బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు

యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..

Updated Date - Aug 29 , 2025 | 03:09 AM