Share News

India Diplomacy: మిత్రులకు ముందే చెప్పి

ABN , Publish Date - May 08 , 2025 | 03:24 AM

పహల్గాం దాడికి ప్రతీకార దాడి తప్పనిసరిగా మారుతుందని భారత్‌ ముందుగానే మిత్రదేశాలకు తెలిపింది. దౌత్యపరంగా విస్తృత చర్చల ద్వారా భారత్‌కు మద్దతుగా ప్రపంచ దేశాలను ఒప్పించడంలో విజయాన్ని సాధించింది.

 India Diplomacy: మిత్రులకు ముందే చెప్పి

‘ఆపరేషన్‌ సిందూర్‌’పై విస్తృత స్థాయిలో దౌత్య చర్చలు

అమెరికా, రష్యా, సౌదీ, యూఏఈ, యూకే, ఫ్రాన్స్‌తో భారత్‌ మంతనాలు

ప్రతీకార దాడికి గోప్యంగా మద్దతు కూడగట్టిన వైనం

ఏకంగా కాబూల్‌ వెళ్లి తాలిబాన్లతో చర్చలు

ఇండియాకు అఫ్ఘాన్‌ పాలకుల మద్దతు

విధి లేక మౌనం పాటించిన చైనా

హల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడికి ఎదురుదాడి తప్పదని మిత్రదేశాలకు భారత్‌ ముందుగానే స్పష్టంచేసింది. అయితే కేవలం ఉగ్రవాద స్థావరాల ధ్వంసం వరకే పరిమితమవుతామని వాటికి తెలియజేసింది. ప్రతీకారం తన హక్కు అని అవి గుర్తించేలా దౌత్యపరంగా విస్తృత కసరత్తే చేపట్టింది. దీనివల్లే పాకిస్థాన్‌కు ఎల్లప్పుడూ మద్దతిచ్చే సౌదీ అరేబియా, యూఏఈ కూడా ఈసారి భారత్‌కు వెన్నంటి నిలిచాయి. అమెరికా, రష్యా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రధాని మోదీకి ఫోన్‌చేసి మరీ మద్దతు తెలిపారు. ఇక ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ద్వారా భారత్‌ను దోషిగా చిత్రించేందుకు పాక్‌ విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. లష్కర్‌, దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ పాక్‌ భూభాగం నుంచే కార్యకలాపాలు నడుపుతున్నాయా లేదా అని మండలి సభ్యదేశాలు దానిని నిలదీశాయి. ఆ దేశానికి మిత్రపక్షం చైనా కూడా మద్దతివ్వకపోవడం గమనార్హం. మండలిలోని తాత్కాలిక సభ్యదేశాలైన అల్జీరియా, డెన్మార్క్‌, గ్రీస్‌, గయానా, పనామా, దక్షిణ కొరియా, సియెర్రా లియోన్‌, స్లొవేనియా, సొమాలియా ప్రతినిధులలతోనూ భారత దౌత్యవేత్తలు గోప్యంగా చర్చించి వాస్తవాలను వాటి దృష్టికి తీసుకెళ్లారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆయా దేశాల విదేశాంగ మంత్రులను ఫోన్ల ద్వారా సంప్రదిస్తూ వచ్చారు. చివరకు ఇండియా ఇప్పటివరకు గుర్తించని అఫ్ఘానిస్థాన్‌ పాలకులైన తాలిబాన్లతోనూ చర్చించి వారి మద్దతు పొందడం దౌత్యపరంగా పెద్దవిజయమే. విదేశాంగ సంయుక్త కార్యదర్శి (పాక్‌, అఫ్ఘాన్‌, ఇరాన్‌ వ్యవహారాలు) ఆనంద్‌ ప్రకాశ్‌ గత నెల 28న చడీచప్పుడు లేకుండా తన బృందంతో నేరుగా కాబూల్‌ వెళ్లారు. తాలిబాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముతాఖీతో సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై చర్చించారు. అఫ్ఘాన్‌ ఎవరికీ శత్రువు కాదని ముతాఖీ పునరుద్ఘాటించారు. నిజానికి సరిహద్దు ఘర్షణలు, అఫ్ఘాన్‌ సైన్యంపై దాడులు, పాక్‌ నుంచి లక్షల మంది అఫ్ఘాన్ల బహిష్కరణ వంటి పరిణామాలతో తాలిబాన్లకు, పాక్‌కు దూరం పెరిగింది. దీనిని భారత్‌ తనకు సావకాశంగా మలచుకుంది.


అమెరికా, రష్యాతో చర్చలు..

అటు విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రుబియో, సెర్జీ లావ్రోవ్‌తో, ఐరోపా దేశాల నేతలతో నిరంతరం ఫోన్లో చర్చలు జరిపారు. ప్రతీకార దాడి నిర్దిష్టంగా ఎలా ఉండబోతోందో అమెరికాకు ముందే వివరించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్‌ మేక్రాన్‌ మోదీకి ఫోన్‌చేసి చర్చలు జరిపారు. జపాన్‌ రక్షణ మంత్రి జనరల్‌ నకతానీ భారత్‌కు వచ్చి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, రక్షణ బంధం పటిష్ఠం చేసుకోవాలని నిర్ణయించారు. పహల్గాం దాడిని నకతానీ ఖండించారు. భారత దౌత్య చర్యల ఫలితంగా మిత్రదేశాలన్నీ.. పహల్గాం దాడికి పాల్పడినవారికి, వారికి మద్దతిచ్చినవారికి శిక్షలు పడాలని డిమాండ్‌ చేశాయి. అయితే భారత్‌ యుద్ధానికి దిగితే అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని పాక్‌ మంత్రులు పదే పదే బెదిరింపులకు దిగడం ఆ దేశానికి ప్రతికూలంగా మారిందని.. ప్రతీకార హక్కు ఇండియాకు ఉందని మిత్రదేశాలు బహిరంగంగానే ప్రకటించడం ప్రభుత్వ దౌత్యవిజయమని మాజీ దౌత్యవేత్తలు, విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగానే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆయన హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. ఆయన విమానం దిగకముందే ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ సౌదీ ప్రకటన చేయడం విశేషం. పాక్‌తో సౌదీ అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. 1965, 71 యుద్ధాల సమయంలో ఆ దేశానికే మద్దతుగా నిలిచింది. అయితే మోదీ ప్రధాని అయ్యాక సౌదీ, యూఏఈతో చమురు, రక్షణ రంగాల్లో బంధాన్ని బలోపేతం చేశారు. దీనితో ఇండియా ఆందోళనను అర్థం చేసుకుని పాక్‌కు మద్దతు ప్రకటించకుండా దూరంగా ఉన్నాయి.

- సెంట్రల్‌ డెస్క్‌


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 03:24 AM