Operation Sindhoor: సంయమనం పాటించండి
ABN , Publish Date - May 08 , 2025 | 03:13 AM
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాలు స్పందించాయి. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలను నివారించి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్‌కు ప్రపంచ దేశాల పిలుపు
ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తాం : చైనా
ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలి: ట్రంప్
భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదు : ఐరాస
చర్చలకే మొగ్గు చూపాలన్న రష్యా, యూఏఈ, జపాన్, యూకే
న్యూఢిల్లీ, మే7: ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ దేశాలు స్పందించాయి. భారత్, పాక్ సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న దానిని చైనా వ్యతిరేకిస్తుందని ఆ విదేశీ వ్యవహారాల శాఖ అధికారి ప్రతినిధి ఒకరు చెప్పారు. ‘‘భారత సైనిక చర్యపై విచారం వ్యక్తం చేస్తున్నాం. భారత్, పాకిస్థాన్ ఎప్పటికీ దాయాది దేశాలే. చైనాకూ పొరుగు దేశాలే. అన్నిరకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తు పరిణామాలను పరిగణనలోకి తీసుకొని ఇరుదేశాలు సంయమనం పాటించాలి’’ అని పేర్కొన్నారు.
సంయమనం పాటించాలి..
భారత్, పాక్ సాధ్యమైన మేర సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలకు దిగితే ప్రపంచం తట్టుకోలేదని పేర్కొన్నారు. భారత ఆపరేషన్‌పై రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. 1999 లాహోర్ డిక్లరేషన్, 1972 సిమ్లా ఒప్పందాలను అనుసరిస్తూ దౌత్యచర్చల ద్వారా ఇరుదేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని రష్యా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు బ్రిటన్ సహా చాలా దేశాలకు ఆందోళనకరమని, ఇరుదేశాలు సంయమనం పాటించాలని బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ చెప్పారు. కాగా, భారత్, పాక్ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని యూఏఈ పేర్కొంది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైతే అది ప్రపంచ శాంతికి కూడా ముప్పేనని, అందువల్ల ఉద్రిక్తతలు మరింత తీవ్రమవ్వకుండా ఇరుదేశాలు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని యూఏఈ ఉప ప్రధాని షేక్ అబ్దుల్ బిన్ జాయద్ ఓ ప్రకటన చేశారు. భారత్ పాకిస్థాన్ మధ్య ప్రతీకార దాడులు తీవ్రమైతే పరిస్థితి యుద్ధానికి దారి తీస్తుందని జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇరుదేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ యోషిమసా హయాషీ కోరారు.
ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలి
ఇక, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం దురదృష్టకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో అన్నారు. ఇరుదేశాలు వందల ఏళ్లుగా పోరాడుతున్నాయని, గత అనుభవాల ప్రకారం ఏదో ఒకటి జరగబోతుందని ప్రజలకు ముందే తెలుసునని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలని ఆకాంక్షించారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News