Assembly Elections: మాజీసీఎం ఈపీఎస్ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:31 PM
ప్రజాస్వామ్యంపై అధికార డీఎంకేకు నమ్మకం లేదని, అందువల్లే ఎన్నికల హామీలు విస్మరించి అవినీతి పాలన సాగిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు.
- ప్రజాస్వామ్యంపై డీఎంకేకు నమ్మకం లేదు: ఈపీఎస్
చెన్నై: ప్రజాస్వామ్యంపై అధికార డీఎంకేకు నమ్మకం లేదని, అందువల్లే ఎన్నికల హామీలు విస్మరించి అవినీతి పాలన సాగిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswamy) ఆరోపించారు. ‘మక్కలై కాప్పోం...తమిళగత్తై మీడ్పోం’ నినాదంతో ఈపీఎస్ చేపట్టిన ప్రచార యాత్ర శుక్రవారం సాయంత్రం ఈరోడ్ జిల్లాలోని మొడకుర్చి నియోజకవర్గాన్ని చేరుకుంది.
అన్నాడీఎంకే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నిర్వాహకులు, బీజేపీ నేతలు సెంథిల్, సేతురామన్, టీఎంసీ మాజీ ఎమ్మెల్యే విడియల్ శేఖర్ తదితర నాయకులు, వేలాది మంది ప్రజలు తరలివచ్చిన రోడ్‌షోలో ఈపీఎస్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని విస్మరించిన సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 525 హామీలలో 10 శాతం కూడా నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపించారు.
ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన స్టాలిన్, తాము అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 150 రోజులకు పొడిగించడంతో పాటు కార్మికుల వేతనం కూడా పెంచుతామని ఇచ్చిన హామి నెరవేర్చలేదన్నారు. చెమటోడ్చిన కార్మికులకు వేతనం పంపిణి చేయకుండా మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు. 2019లో ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికుల వేతనాన్ని పెంచింది అన్నాడీఎంకే ప్రభుత్వమని గుర్తు చేశారు. ఇక ఎప్పుడు ధరలు పెరిగినా, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తగ్గించే చర్యలు చేపట్టింది కూడా తమ ప్రభుత్వమే అన్నారు.

ఈ నాలుగున్నరేళ్లలో టాస్మాక్‌లో రూ.1,000 కోట్ల మేర అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించిందని, రోజుకు 1.5 కోట్ల మద్యం సీసాలు విక్రయిస్తూ ఒక్కో దానిపై అదనంగా రూ.10 వసూలు చేస్తున్నా స్టాలిన్ పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీతో కూటమి ఏర్పాటు చేయడంతో అన్నాడీఎంకేను చూసి డీఎంకే నేతలు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో సమర్థవంతంగా నడిపించగల నేత లేడని, అవినీతిని ప్రోత్సహించడంతో పాటు పలు పార్టీలు మారిన నేతకు కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పారని దుయ్యబట్టారు.
అన్నాడీఎంకే హయాంలో ఈరోడ్ జిల్లాను మూడు తాలూకాలుగా విభజించి, వనరులు మెరుగుపరచడం వల్ల వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా లబ్ధిపొందారన్నారు. మొడకుర్చి నియోజకవర్గానికి రూ.4.5 కోట్లతో కొత్త పరిపాలన భవనం నిర్మించామని, రూ.16 కోట్లతో సిరువాణి తాగునీటి పథకం, రూ.648 కోట్లతో కావేరి సంయుక్త తాగునీటి పథకం, రూ.76 కోట్లతో సాగు కాలువలను నిర్మించామని ఈపీఎస్ గుర్తుచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News