Share News

India Airstrike: సిందూరాస్త్రాలివే

ABN , Publish Date - May 08 , 2025 | 04:50 AM

పహల్గాం దాడులకు ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ 9 ఉగ్రవాద స్థావరాలపై కేవలం 25 నిమిషాల్లో మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో రాఫెల్‌ యుద్ధవిమానాలు, కామికాజె డ్రోన్లు, బ్రహ్మోస్‌ క్షిపణులు వంటి ఆధునిక ఆయుధాలను首次గా వినియోగించింది.

 India Airstrike: సిందూరాస్త్రాలివే

రాఫెల్‌ విమానాలు, హెరాన్‌ డ్రోన్లతో గాలిలో నుంచి దాడులు

ఎగిరే బాంబులు, శతఘ్నులతో భూతల దాడులు

బ్రహ్మోస్‌ క్షిపణులు కూడా ప్రయోగించిన భారత్‌?

పహల్గాం దాడులకు ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాక్‌, పీవోకేలోని 9 లక్ష్యాలపై భారత్‌ దాడులు చేసింది. ఏకంగా తొమ్మిది చోట్ల దాడులు జరిగినప్పటికీ అవన్నీ కేవలం 25 నిముషాల్లోపే ముగిశాయి. ఒకచోట దాడి జరిగిన సమాచారం మరోచోటికి తెలిస్తే అక్కడి వారు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఆ అవకాశం ఇవ్వకుండా ఒకేసారి పక్కా ప్లాన్‌తో అన్నిచోట్లా మెరుపు దాడి చేసింది. అందుకే కీలకమైన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టగలిగింది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని చోట్ల దాడులు జరగడాన్ని బట్టి చూస్తే భారత్‌ అనేక ఆయుధాలను ఈ ఆపరేషన్‌కు వినియోగించినట్టు స్పష్టమవుతోంది. భారీఎత్తున యుద్ధ విమానాలు, డ్రోన్లు, శతఘ్నులు, క్షిపణులతోపాటు లాయిటరింగ్‌ మ్యూనిషన్లను కూడా ఈ దాడుల్లో ఉపయోగించినట్టు తెలుస్తోంది. పాక్‌ సరిహద్దు దాటకుండానే, పాక్‌ గగనతలంలోకి ప్రవేశించకుండానే భారత్‌ లాంగ్‌రేంజ్‌ ఆయుధాలతో భారత్‌ ఈ దాడులు చేసింది. ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్‌ యుద్ధ విమానాలది ఈ దాడుల్లో ప్రధాన పాత్ర అని రక్షణ నిపుణులు చెబుతున్నారు. భారత్‌ వద్ద 36 రాఫెల్‌ యుద్ధ విమానాలు ఉండగా హర్యానాలోని అంబాలాలో 18, బెంగాల్‌లోని హషిమారాలో మరో 18 విమానాలను మోహరించి ఉంచారు. అంబాలా ఎయిర్‌బే్‌సలోని రాఫెల్‌ విమానాలను ఈ దాడుల్లో ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. రాఫెల్‌ విమానాలను భారత్‌ ఒక దాడిలో ఉపయోగించడం ఇదే ప్రప్రథమం. అలాగే కామికాజె డ్రోన్లను, బ్రహ్మోస్‌ క్షిపణులను కూడా తొలిసారిగా శత్రువులపై వాడినట్లు సమాచారం. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ ఉపయోగించిన ఆయుధాలేమిటో పరిశీలిద్దాం.

- ఆంధ్రజ్యోతి రక్షణ ప్రత్యేక ప్రతినిధి


హ్యామర్‌ బాంబులు

హైలీ ఎజైల్‌ మాడ్యులర్‌ మ్యూనిషన్‌ ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ (హ్యామర్‌) బాంబులను కూడా రాఫెల్‌ విమానాలతోపాటే భారత్‌ కొనుగోలు చేసింది. భూమిపై ఉన్న కదిలే, కదలని లక్ష్యాలపై దాడుల కోసం వీటిని ఉపయోగిస్తారు. వీటి రేంజ్‌ 60 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఇందులో 250, 500, 1000 కిలోల వెర్షన్లు ఉన్నాయి. స్కాల్ప్‌ క్షిపణుల్లాగే ఇవి కూడా గట్టి కాంక్రీట్‌ నిర్మాణాలను ధ్వంసం చేయగలవు.

1.jpg

రాఫెల్‌ యుద్ధ విమానాలు

ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ 36 రాఫెల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. 4.5 తరం యుద్ధ విమానాల్లో ఇవి అత్యాధునికమైనవి. స్టెల్త్‌ విమానాలు కాకపోయినా వీటిలో కొన్ని స్టెల్త్‌ ఫీచర్లు ఉన్నాయి. శత్రు రాడార్ల కన్నుగప్పి చొచ్చుకువెళ్లగలవు. శత్రు రాడార్లను, విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థల్ని స్తంభింపజేయగల ఎలకా్ట్రనిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. భారత యుద్ధ విమానాలు పాక్‌ సరిహద్దు దాటకపోయినా సరిహద్దు సమీపంలోకి వెళితే చాలు పాక్‌ విమాన విధ్వంసక వ్యవస్థలు అలర్ట్‌ అవుతాయి. కానీ వాటి కళ్లుగప్పడంలో రాఫెల్‌ విజయవంతమైందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కామికాజె డ్రోన్లు

వీటినే లాయిటరింగ్‌ మ్యూనిషన్లు అని కూడా అంటారు. అంటే ఎగిరే బాంబులు అన్నమాట! ఇవి నేలపై నుంచి తక్కువ ఎత్తులో ఎగురుతూ టార్గెట్‌ను పరిశీలిస్తూ అనువైన సమయంలో వాటిపై పడి ధ్వంసం చేస్తాయి. భారత్‌ నాగాస్త్ర -1, ఎల్‌ఎం 0, ఎల్‌ఎమ్‌ 1, హెక్సాకాప్టర్‌ వంటి లాయిటరింగ్‌ మ్యూనిషన్లను పరీక్షించింది. వీటిని తాజా దాడిలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి ఉండవచ్చని కొందరు రక్షణ నిపుణులు

అంటున్నారు.


బ్రహ్మోస్‌ క్షిపణులు

భారత్‌-రష్యా సంయుక్తంగా రూపొందించిన సూపర్‌సానిక్‌ క్రూజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌. ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించి శత్రు భూభాగంపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదు. భారత త్రివిధ దళాలు ఈ క్షిపణిని ఉపయోగిస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో ఆర్మీ వీటిని వాడినట్లు చెబుతున్నారు. మొదట ఈ క్షిపణుల రేంజ్‌ 290 కిలోమీటర్లు మాత్రమే ఉండేది. తర్వాత దీనిని 500 కిలోమీటర్లకు పెంచారు.

hg.jpg

హెరాన్‌ డ్రోన్లు

ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసిన ఈ డ్రోన్లలో మార్క్‌ 1, 2 అనే రెండు వెర్షన్లు ఉన్నాయి. మొదటిది కేవలం నిఘా కోసం మాత్రమే ఉపయోగిస్తారు. రెండో వెర్షన్‌ బాంబులు కూడా ప్రయోగించగలదు. మార్క్‌ 2 వెర్షన్‌ భారత్‌ వద్ద ఉన్నప్పటికీ వాటికి బాంబులను అమర్చే ప్రక్రియ జరగలేదని ఇప్పటివరకూ ఉన్న సమాచారం. తాజా దాడుల్లో కొన్ని డ్రోన్లు కూడా పాలుపంచుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నదానిని బట్టి చూస్తే భారత్‌ వీటికి బాంబులు అమర్చి ఉండవచ్చనే అభిప్రాయాన్ని కొందరు రక్షణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే హెరాన్‌ డ్రోన్లు టార్గెట్లను గుర్తించి వాటిపై లేజర్‌ కిరణాలను ప్రసరింపజేస్తాయని, దాని ఆధారంగా రాఫెల్‌ యుద్ధ విమానాలు ఆ టార్గెట్లపై దాడి చేసి ఉండవచ్చని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రోన్లు 30,000 అడుగుల ఎత్తులో 45 గంటలపాటు గాలిలో ఎగురుతూ నేల మీద ఏం జరుగుతున్నదీ పరిశీలించగలవు.


స్కాల్ప్‌ క్రూజ్‌ క్షిపణులు:

రాఫెల్‌ విమానాల నుంచి ప్రయోగించగల ఈ స్కాల్ప్‌ క్షిపణుల్ని భారత్‌ ఆ విమానాలతో పాటే కొనుగోలు చేసింది. ఇవి 250 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో భూమిపై ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. శత్రు రాడార్లకు కనిపించకుండా ప్రయాణించే స్టెల్త్‌ సామర్థ్యంతోపాటు భూమికి సమాంతరంగా ఒకే ఎత్తును మెయింటెయిన్‌ చేయగల సత్తా వీటికి ఉంది. అంటే కింద కొండ ఉంటే క్షిపణి పైకి లేస్తుంది. కింద లోయ ఉంటే కిందికి దిగుతుంది. ఇది 450 కిలోగ్రాముల టాండెమ్‌ వార్‌ హెడ్‌ కలిగి ఉంటుంది. టాండెమ్‌ అంటే ముందు ఒక పేలుడు జరిగి క్షిపణి కొంతదూరం చొచ్చుకువెళ్లాక రెండో పేలుడు జరుగుతుంది. దీనివల్ల ఎంత గట్టి కాంక్రీట్‌ నిర్మాణాలైనా ధ్వంసం అవుతాయి.

శతఘ్నులు, రాకెట్లు

అంతర్జాతీయ సరిహద్దు, ఎల్‌వోసీ సమీపంలోని లక్ష్యాలపై దాడి చేయడానికి 155 ఎంఎం శతఘ్నుల్ని, పినాక రాకెట్లను భారత్‌ ఉపయోగించినట్లు సమాచారం. శతఘ్నుల ద్వారా 40-50 కిలోమీటర్లు, పినాక రాకెట్ల ద్వారా 90 కిలోమీటర్లలోని లక్ష్యాలపై దాడి చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 04:50 AM