EPS: మాజీసీఎం సంచలన కామెంట్స్.. మా పార్టీ ఎవరికీ తలవంచదు
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:04 PM
అన్నాడీఎంకే ఎవరికీ తలవంచదని, మిత్రపక్షాలను బానిసలుగా చూడటం డీఎంకే నైజమని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో నియోజకవర్గాల వారీగా ఈపీఎస్ చేస్తున్న ప్రచారయాత్ర నీలగిరి జిల్లాలోని గూడలూరు నియోజకవర్గానికి చేరుకుంది.
- ఎడప్పాడి పళనిస్వామి
చెన్నై: అన్నాడీఎంకే ఎవరికీ తలవంచదని, మిత్రపక్షాలను బానిసలుగా చూడటం డీఎంకే నైజమని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) వ్యాఖ్యానించారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో నియోజకవర్గాల వారీగా ఈపీఎస్ చేస్తున్న ప్రచారయాత్ర బుధవారం నీలగిరి(Neelagiri) జిల్లాలోని గూడలూరు నియోజకవర్గానికి చేరుకుంది. దేశంలోనే ఉన్నత విద్యలో తమిళనాడును అగ్రస్థానంలో నిలిపిన ఘనత అన్నాడీఎంకే ప్రభుత్వానిదేనని, అందుకే ఆ రంగానికి అధిక నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా కేంద్రప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, పథకాలను ఏ మాత్రం జాప్యం లేకుండా పొందడంతో పాటు కేంద్రాన్ని మెప్పింది ప్రభుత్వ వైద్యకళాశాలలను కూడా తీసుకొచ్చింది అన్నాడీఎంకే ప్రభుత్వమేనని, అయితే ఈ డీఎంకే హయాంలో ఇలాంటి ఏ పథకాన్నికూడా తీసుకురాలేపోయారని విమర్శించారు. దేశంలో అధికంగా అప్పులు చేయడంలో తమిళనాడు అదర్శవంతంగా ఉం దని, అవినీతి, కమీషన్, కరప్షన్‌లో కూడా డీఎంకేకు సాటి ఎవరూలేరని ఈపీఎస్ ధ్వజమెత్తారు.
1999లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమిలో డీఎంకే చేరిందని, ఆ ఎన్నికల్లో గెలవడం ద్వారా అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వంలో డీఎంకే తరుఫున మురసొళిమారన్ కేంద్రమంత్రిగా పనిచేశారని, అప్పుడు బీజేపీని మంచిపార్టీగా డీఎంకే అభివర్ణించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీని మతవాద పార్టీగా డీఎంకే విమర్శించడం సరికాదన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ చట్టం అమలుకు వచ్చిందని, అప్పుడు డీఎంకే నేతలతో పాటు స్టాలిన్‌ను కూడా జైలుకెళ్లారని, అయితే తమను జైలుపాలు చేసిన కాంగ్రెస్ తో ఎందుకు పొత్తు కుదుర్చుకున్నారో ఆ భగవంతునికే ఎరుకన్నారు.

డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో సీబీఐ తనిఖీలతర్వాతే కాంగ్రెస్ తో డీఎంకే పొత్తు కుదుర్చుకుందని, ఈ వాస్తవాన్ని పక్కనబెట్టి అన్నాడీఎంకే బీజేపీకి బానిసైందని విమర్శించడం న్యాయంకాదన్నారు. నీలగిరి జిల్లాలో సొంతిల్లు నిర్మించుకోవాలనుకున్నవారి నుంచి వెయ్యి చదరపు అడుగుల ఇంటిప్లాను గుర్తింపుకు ఈ ప్రభుత్వం రూ.74వేలు వసూలు చేస్తోందని, అలాగే అన్ని రంగాల్లో పన్నులు పెంచిందని, అధికంగా అప్పులు పొంది ఓటేసి గెలిపించిన ప్రజలపై ఆర్థికభారం మోపిన డీఎంకే ప్రభుత్వాన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని ప్రజానీకాన్ని ఈపీఎస్ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News