Delhi Blasts Prime Suspect: ఢిల్లీ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు.. గతంలో ఓసారి జాబ్ పోగొట్టుకుని..
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:17 PM
ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితుడిగా ఉన్న డా.ఉమర్ గతంలో ఓ పేషెంట్ మృతికి కారణమైనందుకు జాబ్ పోగొట్టుకున్నట్టు జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పేలుడు పదార్థాలతో నింపిన కారు ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా పేలడంతో పలువురు మృత్యువాత పడ్డారు. ఘటన సమయంలో కారు నడిపిన వ్యక్తిని డా. ఉమర్ ఉన్ నబీగా పోలీసులు గుర్తించారు. పేలుడులో అతడి శరీరం కూడా ఛిద్రమైపోయింది. నిందితుడి డీఎన్ఏ శాంపిల్స్‌తో పాటు అతడి కుటుంబసభ్యుల శాంపిల్స్‌ను దర్యాప్తు సంస్థలు సేకరించాయి. డీఎన్ఏ టెస్టు ఫలితాల ఆధారంగా డ్రైవర్ ఎవరనేది పోలీసులు నిర్ధారించనున్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, డా.ఉమర్ గురించి పలు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ వృత్తిలో ఉంటూ ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తి ఇంతటి ఘాతుకానికి దిగడంపై యావత్ దేశం షాకయిపోయింది. అయితే, గతంలో ఓ పేషెంట్ మృతికి కారణమైనందుకు డా.నబీ ఉద్యోగం పోగొట్టుకున్నట్టు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. నబీ అప్పట్లో అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసేవాడు. 2023లో సీనియర్ రెసిడెంట్‌గా పనిచేసిన సమయంలో పేషెంట్లు అతడిపై ఫిర్యాదులు చేసేవారు. అమర్యాదగా వ్యవహరించేవాడని, గొడవలు పడేవాడని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఓసారి విషమపరిస్థితిలో ఉన్న ఓ పేషెంట్ బాధ్యతను డా.నబీకి అప్పగించారు. కానీ అతడు అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ సమయంలో పేషెంట్ పరిస్థితి విషమించింది. ఇతర డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో సీనియర్ డాక్టర్ల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. ఈ ఘటనకు డా.ఉమర్ కారణమని నిర్ధారించింది. దీంతో, అతడు జాబ్ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తరువాతే అతడు ఫరీదాబాద్‌లోని అల్ ఫలా స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో చేరినట్టు తెలిసింది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి