Delhi CM Z Category Security: ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇచ్చిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించుకున్న కేంద్రం
ABN , Publish Date - Aug 25 , 2025 | 08:49 AM
ఢిల్లీ సీఎంకు ఇటీవల కల్పించిన జెడ్ కేటగిరీ భద్రతను కేంద్రం ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ముఖ్యమంత్రి భద్రతావ్యవహారాలను ఢిల్లీ పోలీసులు పర్యవేక్షించనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రికి కల్పించిన జెడ్ కేటగిరీ సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇకపై ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రికి భద్రత కల్పించనున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఓ వ్యక్తి సీఎం రేఖా గుప్తాపై దాడి చేసిన నేపథ్యంలో కేంద్రం సీఎంకు జెడ్ క్యాటగిరీ భద్రత కల్పించింది. ముఖ్యమంత్రికీ భద్రత కల్పించాలని కేంద్ర హోమ్ శాఖ సీఆర్‌పీఎఫ్‌ను ఆదేశించింది. ఈ భద్రతను మరింత కాలం పొడిగించొచ్చన్న వార్తలు వెలువడ్డాయి. అయితే, కేంద్రం ఢిల్లీ సీఎం జెడ్ కేటగిరీ భద్రతా ఏర్పాట్లను తొలగించేందుకు నిర్ణయించింది. ఇకపై సీఎం భద్రత వ్యవహారాలను ఢిల్లీ పోలీసులు పర్యవేక్షించనున్నారు.
సీఎం రేఖ గుప్తా సివిల్ లైన్స్‌లోని ‘జన్ సున్‌వాయి’ కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సఖ్రియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీ ఆటోడ్రైవర్ అని, అతడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన వాడని పోలీసులు తెలిపారు.
ఘటనపై దర్యాప్తులో భాగంగా పోలీసులు.. సీఎం నివాసంలో భద్రతా లోపాలను కూడా గుర్తించారు. ఈ లోపాల కారణంగా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను హోం మంత్రిత్వ శాఖకు పంపించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇవి కూడా చదవండి:
ట్రంప్‌పై నిరసన..నాగ్‌పూర్‌లో భారీ దిష్టిబొమ్మ ప్రదర్శన
టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి