Congress: ఢిల్లీ CWC సమావేశంలో ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:33 PM
CWC సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఇవాళ ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) రద్దుతో కోట్లాది పేదలకు ఉపాధి కరువవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఖర్గే పలు కీలక అంశాలపై మాట్లాడారు.
MGNREGA రద్దుపై తీవ్ర విమర్శలు:
MGNREGA రద్దును మహాత్మాగాంధీకి అవమానంగా, 'రైట్ టు వర్క్'పై మోదీ సర్కార్ క్రూర దాడిగా ఖర్గే అభివర్ణించారు. 'పేదల కడుపుపై తన్నిన మోదీ ప్రభుత్వం... పేదల కంటే కార్పొరేట్ల లాభాలే ముఖ్యం' అని ఖర్గే విమర్శించారు. UPA హయాంలో అమలైన హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.
2006లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఈ పథకం గ్రామీణ భారత ముఖచిత్రాన్ని మార్చిందని, దళితులు, ఆదివాసీలు, మహిళలకు భరోసా ఇచ్చిందని, పేదరికం నుంచి బయటపడ్డ తరాన్ని సృష్టించిందని ఖర్గే చెప్పుకొచ్చారు. ఎలాంటి అధ్యయనం లేకుండా రద్దు చేశారని మండిపడ్డారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాల తరహాలోనేనని, రైతు ఉద్యమంలా దేశవ్యాప్త పోరాటం అవసరమని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. MGNREGAపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సభ్యులకు ఖర్గే సూచించారు.
పార్టీ బలోపేతం, ఎన్నికలకు సంసిద్ధత:
కాంగ్రెస్ 'సంస్థా సృజన అభియాన్'ను కొనసాగిస్తామని ఖర్గే తెలిపారు. 500 జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయిందని, బూత్ స్థాయి వరకూ పార్టీని బలోపేతం చేస్తున్నామని ఖర్గే చెప్పారు. 2026 ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమని ఆయన ప్రకటించారు.
ఇతర కీలక అంశాలు:
'SIR' పేరుతో ఓటర్ల హక్కులపై కుట్ర జరుగుతోందని, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల పేర్లు తొలగించొద్దని ఖర్గే హెచ్చరించారు. ED, IT, CBIల దుర్వినియోగం జరుగుతోందని, నేషనల్ హెరాల్డ్ కేసులో న్యాయ పోరాటం కొనసాగుతోందని తెలిపారు.
బాంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులను ఖర్గే ఖండించారు. దేశంలో సామరస్యం దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి సిద్ధమని ఖర్గే ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News