Share News

CPIM Leader: అధికార లాంఛనాలతో.. నేడుసురవరానికి వీడ్కోలు

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:50 AM

సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ మేరకు అధికారులను శనివారం ఆదేశించారు. ..

CPIM Leader: అధికార లాంఛనాలతో.. నేడుసురవరానికి వీడ్కోలు

  • అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశం

  • నేటి మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర

  • ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్‌

  • సహా ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఈ మేరకు అధికారులను శనివారం ఆదేశించారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన చేసింది. సురవరం అంతిమయాత్ర ను ఆదివారం నిర్వహిస్తున్నామని సీపీఐ ప్రకటించింది. సురవరం భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం 9 గంటలకు గచ్చిబౌలిలోని కేర్‌ ఆస్పత్రి నుంచి హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయం(మగ్దూం భవన్‌)కి తరలిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భౌతికకాయాన్ని ప్రజల సందర్శనకు ఉంచుతారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి గాంధీ వైద్య కళాశాల వరకు అంతిమయాత్ర నిర్వహిస్తారు. సురవరం భౌతికకాయాన్ని వైద్య, విద్య పరిశోధనల నిమిత్తం వైద్యకళాశాలకు అప్పగించనున్నారు. కాగా, పార్టీ శ్రేణులు ఎర్ర వస్త్రాలు ధరించి సురవరం అంతిమయాత్రలో పాల్గొనాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కోరారు.


అత్యున్నత నేతల్లో ఒకరు సురవరం

దేశంలోని అణగారిన వర్గాల ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు సురవరం అని సీపీఐ కొనియాడింది. భారత కమ్యూనిస్టు అత్యున్నత నాయకుల్లో ఒకరిగా సురవరం ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సురవరం చిత్రపటానికి సీపీఐ నేతలు నివాళులర్పించారు. సురవరం మరణానికి సంతాపంగా పార్టీ జెండా అవనతం చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎ్‌సఎఫ్‌) ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్‌) అధ్యక్షుడిగా సురవరం చేసిన ప్రజాపోరాటాలను నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నల్లగొండలో ఫ్లోరైడ్‌ కాలుష్యం, రైతుల సమస్యలు, నల్లధనం, 2జీ కుంభకోణం వంటి అంశాలపై పార్లమెంటులో చేసిన ప్రసంగాలతో సురవరం అన్ని పార్టీల గౌరవం పొందారని స్మరించుకున్నారు. ఇక, హైదరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో ఉన్న సురవరం భౌతికకాయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలువురు నేతలు శనివారం సందర్శించారు. పార్టీ కార్యాలయంలో సురవరం చిత్రపటానికి నివాళి అర్పించారు.


ప్రముఖుల సంతాపం

సురవరం మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. నిత్యం ప్రజల కోసమే పని చేసే సురవరం ఇక లేరంటే నమ్మలేకపోతున్నానని చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సురవరం కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. న్యాయంకోసం, ఆత్మగౌరవం కోసం సురవరం సాగించిన ఉద్యమజీవితం స్ఫూర్తిదాయకమని తమిళనాడు సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు. సురవరం కమ్యూనిస్టు నాయకుడే కాక గొప్ప పార్లమెంటేరియన్‌ అని కేరళ సీఎం పినరయి కొనియాడారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ కూడా సురవరం మృతికి సంతాపం తెలియజేశారు. విద్యార్థి దశ నుంచే ప్రజాపోరాటాలు చేస్తూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితం ధారబోసిన వ్యక్తి సురవం అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. పీడిత ప్రజల కోసం అనేక ప్రజాపోరాటాలు చేసిన ఉద్యమనేత సురవరం అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. సురవరం మరణం పార్టీకి తీరని లోటు అని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. సురవరం మృతి పట్ల సీపీఐ(ఎం) సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య, ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర కమిటీ, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కౌన్సిల్‌ అధ్యక్షులు అనిల్‌ సంతాపం వ్యక్తం చేశారు.

కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై సురవరం పోటీ

సురవరం సీపీఐ తరఫున 1980 నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1994లో కర్నూల్‌ జిల్లాలోని డోన్‌ నియోజకవర్గంలో అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు 1980, 1985 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1998లో 12వ లోక్‌సభకు, 2004లో 14వ లోక్‌సభకు నల్లగొండ నుంచి ఎన్నికయ్యారు. కాగా, ఉమ్మడి ఏపీలో జరిగిన విద్యుత్‌ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 03:50 AM