Share News

Shashi Tharoor: ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ

ABN , Publish Date - Jun 20 , 2025 | 02:04 PM

కాంగ్రెస్ పార్టీకి.. ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌కి మధ్య దూరంగా పెరిగిందనే ఓ ప్రచారం జరుగుతోంది. అలాంటి వేళ.. ఎంపీ శశిథరూర్ చేసిన తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

Shashi Tharoor: ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు.. స్పందించిన కాంగ్రెస్ పార్టీ
Congress Party MP Shashi Tharoor

తిరువనంతపురం, జూన్ 20: కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల వేళ ప్రచారానికి తనను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించలేదంటూ తిరువనంతపురం ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. శుక్రవారం కేరళ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సన్నీ జోసఫ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఉప ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎంపీ శశిథరూర్ పేరు ఉందన్నారు.


అందుకు సంబంధించిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం సమర్పించామని వివరించారు. అంతకు మించి ఈ వ్యవహారంపై తాను స్పందించ లేనంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఉప ఎన్నికల ప్రచారానికి కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోని తప్ప మిగిలిన నేతలంతా సహాకరించారన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన అర్యాదన్ షౌకత్‌కు మద్దతుగా రమేశ్ చన్నీతాల, కె సురేశ్ ఈ ప్రచారంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.


గురువారం మీరు ఎందుకు నిలంబూర్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనలేదంటూ ఎంపీ శశిథరూర్‌ను విలేకర్లు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన సమాధానమిస్తూ.. తనను పార్టీ ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. అదీకాక ఆ సమయంలో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని పేర్కొన్నారు. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ సన్నీ జోసఫ్‌ పై విధంగా స్పందించారు.


నిలంబూర్ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగిందంటే..

జూన్ 19వ తేదీన నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ జాబితాలో కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ స్థానం ఉంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23వ తేదీన వెలువడనున్నాయి.


అది వాస్తవమే..

కాంగ్రెస్ పార్టీలోని పలువురు అగ్రనేతలకు తనకు మధ్య గ్యాప్ పెరిగిన మాట వాస్తవమని ఇప్పటికే ఎంపీ శశిథరూర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


విదేశాలకు ఎంపీ శశిథరూర్..

మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అయితే ఈ ఆపరేషన్ సిందూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందన విషయాన్ని వివిధ దేశాలకు తెలియజేయాలని భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా వివిధ రాజకీయ పార్టీ ఎంపీలతో 7 బృందాలను కేంద్రం ఎంపిక చేసింది. ఆ జాబితాలో ఒక బృందానికి ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు.


ఇంకోవైపు ఎంపీల పేర్లు ఎంపిక చేసి పంపాలని కాంగ్రెస్ పార్టీని మోదీ ప్రభుత్వం కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసి పంపిన ఎంపీల జాబితాను కాకుండా.. ఎంపీ శశిథరూర్‌ పేరును మోదీ ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ కాస్త ఘాటుగా స్పందించింది. అదీకాక ఇటీవల మోదీ ప్రభుత్వంలోని పలువురు కీలక నేతలతో ఎంపీ శశిథరూర్ సన్నిహితంగా మెలుగుతున్న విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

ఘోర రోడ్డుప్రమాదం.. తొమ్మిది మంది మృతి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ రూట్లలో విమాన సర్వీసులు రద్దు

For National News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 03:27 PM