Share News

Salman Khurshid : బీజేపీ చర్యను స్వాగతించిన కాంగ్రెస్ ఎంపీ

ABN , Publish Date - May 30 , 2025 | 10:48 AM

కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ఆ పార్టీ ఎంపీలతో కలిసి సెల్పీలు దిగుతున్నారంటూ పార్టీ అధిష్ఠానం కాస్త గుర్రుగా ఉంది. అలాంటి వేళ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ సైతం ఆర్టికల్ 370 రద్దును స్వాగతించడం పట్ల పార్టీ అధిష్ఠానం ఆయనపై ఎలా వ్యవహరిస్తుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Salman Khurshid : బీజేపీ చర్యను స్వాగతించిన కాంగ్రెస్ ఎంపీ
Congress MP Salman Khurshid

న్యూఢిల్లీ, మే 30: జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సల్మాన్ ఖుర్షీద్ స్వాగతించారు. ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించేదని ఆయన అన్నారు. తద్వారా దేశంలోనే ఆ రాష్ట్రం ఉన్నా.. మిగిలిన ప్రాంతాలతో వేరుగా ఉన్నట్లు ఓ భావన ఉండేదన్నారు. కానీ ఈ ఆర్టికల్ రద్దుతో ఆ భావన తమలో పూర్తిగా పోయిందని తెలిపారు. ఈ ఆర్టికల్ రద్దు అనంతరం ఆ రాష్ట్ర ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, ఆ క్రమంలో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 65శాతం మేర పోలింగ్ నమోదయిందని గుర్తు చేశారు. దీంతో రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పాటైందని వివరించారు. ఇండినేషియా పర్యటనలో భాగంగా అక్కడి మేథావులు, విద్యా సంస్థల ప్రతినిధులతో విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.


ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా 26 మంది మరణించారు. ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనే స్పష్టమైన సాక్ష్యాలను భారత్ సంపాదించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ చర్యలను ప్రపంచానికి చాటాలని భారత్ భావించింది. అందుకోసం వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఏడు బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ ఏడు బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తూ.. ఆయా దేశాల వేదికగా ఉగ్రవాదంపై పాక్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నాయి. ఆ క్రమంలో జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలో ఓ ఎంపీల బృందం ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్‌లో పర్యటిస్తోంది. ఈ బృందంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ సల్మాన్ ఖుర్షీద్ సభ్యుడిగా ఉన్నారు.


2019, ఆగస్టులో జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఆగస్టులో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టి బరిలో నిలిచిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఆ రాష్ట్ర ఓటర్లు పట్టం కట్టారు. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ఈ ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ ఒమర్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ తీర్మానంపై బీజేపీ మండిపడింది. అంతేకాదు.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మళ్లీ భూమి మీదకు వచ్చినా.. ఈ ఆర్టికల్‌ను పునరుద్దరించలేరని బీజేపీ క్లియర్ కట్‌గా స్పష్టం చేసింది.


మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. ఆ పార్టీ ఎంపీలతో కలిసి సెల్ఫీలు దిగుతున్నారంటూ పార్టీ అధిష్టానం కాస్తా గుర్రుగా ఉంది. అలాంటి వేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ సైతం ఆర్టికల్ 370 రద్దును స్వాగతించడం పట్ల ఆ పార్టీ అధిష్టానం ఆయనపై ఎలా వ్యవహరిస్తుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బాత్‌రూమ్‌లో నీళ్లు లేవు.. మండిపడ్డ నటి

బాణా సంచా కేంద్రంలో పేలుడు.. ఐదుగురు మృతి

For National News And Telugu News

Updated Date - May 30 , 2025 | 02:18 PM