Share News

Congress: నిఘా వైఫల్యంపై విచారణ జరపాలి

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:36 AM

పహల్గాం ఉగ్రదాడి ఒక దారుణమైన ఘటనగా పేర్కొన్న కాంగ్రెస్, దీనిని ప్రజాస్వామ్యంపై నేరుగా దాడిగా భావించింది. భద్రతా వ్యతిరేకంగా నిఘా వైఫల్యాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్‌ చేశారు

Congress: నిఘా వైఫల్యంపై విచారణ జరపాలి

  • మూడంచెల భద్రత మధ్య ఉండే చోట ఇంత దారుణమా?

  • విద్వేషాల కోసం బీజేపీ వాడుకోవడం బాధాకరం: సీడబ్ల్యూసీ

  • ఉగ్రదాడికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): పహల్గాంలో ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, అది నేరుగా భారత ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. మూడంచెల భద్రత మధ్య ఉండే ప్రాంతంలో దారుణం జరిగిందని, ఇందులో నిఘా వైఫల్యాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. అందరం ఐక్యంగా ఉండాల్సిన ఈ సమయంలో.. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండటం బాధాకరమని విమర్శించింది. ఉగ్రదాడికి నిరసనగా, మృతులకు నివాళిగా శుక్రవారం దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. పహల్గాం ఘటన నేపథ్యంలో గురువారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడి మృతులకు నివాళిగా మౌనం పాటించారు.


అంతా సంయమనం పాటించాలి..

‘‘పహల్గాం ఉగ్రదాడితో షాక్‌కు గురయ్యాం. ఇది నేరుగా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. దీనికి పాకిస్థానే ప్రధాన సూత్రధారి. దేశంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పహల్గాం మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఉండే ప్రాంతం. కేంద్ర పాలిత ప్రాంతం. అయినా ఉగ్రదాడి జరగడం బాధాకరం. నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది. ఉగ్రదాడిని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు ఖండించిన తీరు హర్షణీయం. అయితే, ప్రజలను విభజించేలా, విద్వేషాన్ని ప్రోత్సహించేలా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు బాధాకరం. బీజేపీ సోషల్‌ మీడియా వేదికల ద్వారా ఐక్యతను దెబ్బతీసేలా ప్రచారం చేయడం దిగ్ర్భాంతిని కలిగిస్తోంది’’ అని తీర్మానంలో కాంగ్రెస్‌ పేర్కొంది. ఉగ్రదాడి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందని జమ్మూకశ్మీర్‌ సీఎల్పీ నేత గులామ్‌ అహ్మద్‌ మిర్‌ పేర్కొన్నారు. ఎప్పుడూ భద్రత ఉండే ‘బైసారన్‌ పర్యాటక ప్రాంతంలో దాడి జరిగిన రోజున భద్రత ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 04:36 AM