CM Stalin: ఎన్నికలయ్యే వరకు నో రెస్ట్..
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:00 AM
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ ‘విశ్రాంతి’ అనే మాట మరిచి, పార్టీ కోసం ముమ్మరంగా ప్రచారం చేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కార్యదర్శులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
- డీఎంకే జిల్లా నేతలకు స్టాలిన్ దిశా నిర్దేశం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేవరకూ ‘విశ్రాంతి’ అనే మాట మరిచి, పార్టీ కోసం ముమ్మరంగా ప్రచారం చేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కార్యదర్శులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్(CM Stalin) పిలుపునిచ్చారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. పదేళ్ల అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో పాతాళానికి చేరుకున్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వం విజయం సాధించిందని,
గడిచిన నాలుగున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 11.19 శాతానికి పెరిగిందని, రాష్ట్రాన్ని పారిశ్రామికపరంగా అభివృద్ధి చేసే దిశగా ఇటీవల తాను జరిపిన జర్మనీ, ఇంగ్లండ్ దేశాల పర్యటలో భారీగా పారిశ్రామిక పెట్టుబడులను సమీకరించానని చెప్పారు. విదేశీ పర్యటనలో రూ.15,516 కోట్ల పెట్టుబడులు సమీకరించడంతో పర్యటన ‘సూపర్ హిట్’ అయ్యిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ట్రిలియన్ డాలర్లకు పెంచాలన్న లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలంటే పెట్టుబడుల సమీకరణ, విదేశీ పర్యటనలు చాలవని,

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగానే జూలై 3న ‘ఏకతాటిపై తమిళనాడు’ అనే ఉద్యమాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ జిల్లా కార్యదర్శులు, నగర, పట్టణ శాఖ కార్యదర్శులే కాకుండా పార్టీ కార్యకర్తలు, బూత్ కమిటీ ఇన్‌ఛార్జులు ‘విశ్రాంతి’ అనే మాటే మరచిపోవాలని, నిద్రాహారాలు కూడా పట్టించుకోకుండా పార్టీ అభ్యర్థులు, కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 15న అన్నాదురై జయంతి సందర్భంగా 68 వేల పోలింగ్ కేంద్రాల ఇన్‌ఛార్జులు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, కూటమి అభ్యర్థుల విజయానికి పాటుపడతామని శపథం చేయాలన్నారు. అన్నాదురై జయంతి వేడుకలు పూర్తయిన తర్వాత 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఏకతాటిపై తమిళనాడు’ ప్రచార కార్యక్రమాన్ని, సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో మరో మారు ద్రావిడతరహా డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు కోసం పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
సీఎం రేవంత్ ఇంటి ప్రహరీ కూల్చివేత
Read Latest Telangana News and National News