CM Stalin: నేను మాటల మనిషిని కానే కాదు..
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:07 AM
పదేళ్ల అన్నాడీఎంకే పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అథఃపాతాళానికి చేరిందని, గత నాలుగేళ్ల డీఎంకే ద్రావిడ తరహా పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పురోగమించినట్లు కేంద్రప్రభుత్వమే ప్రకటించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
- అన్నాడీఎంకే ఓటమి పడమటి జోన్ నుంచే ఆరంభం
- ఉడుమలపేట సభలో స్టాలిన్ ధ్వజం
చెన్నై: పదేళ్ల అన్నాడీఎంకే పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అథఃపాతాళానికి చేరిందని, గత నాలుగేళ్ల డీఎంకే ద్రావిడ తరహా పాలనలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి పురోగమించినట్లు కేంద్రప్రభుత్వమే ప్రకటించిందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister Stalin) పేర్కొన్నారు. అయితే వాస్తవాలకు విరుద్ధంగా డీఎంకే పాలనలో అభివృద్ధి శూన్యమంటూ ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయనలా తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని సీఎం పేర్కొన్నారు.
తిరుప్పూరు జిల్లా ఉడుమలపేట నేతాజీ మైదానంలో సోమవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో రూ. 1426.89 కోట్లతో పూర్తయిన పథకాలను సీఎం ప్రారంభించారు. 35 కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు.
వివిధ సంక్షేమ పథకాల కింద 19,785 మంది లద్ధిదారులకు రూ.295.29 కోట్ల విలువైన సహాయాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీల కంటే ముందుగా ఈపీఎస్ ఇక్కడి పడమటి జోన్ నుండి ప్రచార పర్యటనను ప్రారంభించారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జోన్ నుండే అన్నాడీఎంకే ఓటమి ప్రారంభమవుతుందని తెలియకపోవడం శోచనీయమన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే చిత్తుగా ఓడిపోయిందని, వాస్తవాలు ఇలా ఉండగా తాను పడమటి జోన్‌కు చెందిన వ్యక్తినని, రైతుబిడ్డనని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా ఉంగలుడన్ స్టాలిన్, నలమ్‌కాక్కుం స్టాలిన్ పథకాలకు లభిస్తున్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేకే ఈపీఎస్ తనను ఏకవచనంతో విమర్శించే స్థాయికి దిగజారి పోయారన్నారు.

ఉంగలుడన్ స్టాలిన్ పథకంపై హైకోర్టులో పిటిషన్ వేసి అభాసుపాలై , కోర్టు రూ.10లక్షల జరిమానా విధించినా ఈపీఎస్ మళ్ళీ అదే పనిగా ప్రభుత్వ పథకాలపై పసలేని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈపీఎస్ తనను ఎంజీఆర్‌లా, జయలలితలా ఊహించుకుని ప్రచారంలో ఆ నేతలలాగే హావభావాలను ప్రదర్శించి చూపరులకు ఏవగింపు కలిగిస్తున్నారని స్టాలిన్ విమర్శించారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పత్తా లేకుండా పోవటం తథ్యమని స్టాలిన్ పేర్కొన్నారు.
తిరుప్పూరుకు వరాల జల్లు..
తిరుప్పూరు జిల్లాకు ముఖ్యమంత్రి స్టాలిన్ నాలుగు వరాలను ప్రకటించారు. కేరళ ప్రభుత్వంతో చర్చించి నీరారు - నల్లారు, ఆనైమలైయారు అనుసంధాన పధకాన్ని వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. పరంబికుళం ఆళియారు సాగు పథకం కాలువల్లో పూడిక తీత పనులకు రూ.10 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నామని తెలిపారు. తిరుచ్చి కార్పొరేషన్‌లో రూ.9కోట్లతో గ్రంథాలయం, అమరజ్యోతి గార్డెన్ ప్రాంతం వద్ద రూ.5 కోట్లతో క్రీడామైదానం నిర్మిస్తామని,
కాంగేయం నగర పంచాయతీలో రూ.11కోట్లతో తాగునీటి పథకాలు అమలు చేస్తామని, నంజియంపాళయం వద్ద ఉప్పారుపై రూ.7.60 కోట్లతో చెక్‌డ్యామ్ నిర్మించనున్నామని, ఊత్తుకుళి యూనియన్ ప్రాంతంలో రూ.6.5 కోటతో వెన్న కర్మాగారం నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఉడుమలపేటలోని తాజ్‌థియేటర్ సమీపంలో రహదారికి మాజీ మంత్రి సాదిక్‌బాషా పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తుసామి, ఎంపీ సామినాథన్, చక్రపాణి, కయల్‌విళి సెల్వరాజ్, జిల్లా కలెక్టర్ మనీష్ నారాణవరే, మేయర్ దినే్‌షకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..
చట్టాలు తెలుసుకుని అమెరికా రండి
Read Latest Telangana News and National News