Union Cabinet On Delhi Blast: ఇది ఉగ్రదాడే, దోషులను విడిచిపెట్టం.. కేంద్ర కేబినెట్
ABN , Publish Date - Nov 12 , 2025 | 09:42 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో బుధవారం సాయంత్రం 7 గంటలకు కేంద్ర కేబినెట్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల సేపు ఈ సమావేశం జరిగింది.
న్యూఢిల్లీ: ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనను ఉగ్రవాద ఘటనగా కేంద్రం పేర్కొంది. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా సహించేది లేదని పునరుద్ఘాటించింది. పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లో బుధవారం సాయంత్రం 7 గంటలకు కేంద్ర కేబినెట్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు రెండు గంటల సేపు ఈ సమావేశం జరిగింది. అనంతరం సమావేశం వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
ఢిల్లీ పేలుడు ఘటన అత్యంత కిరాతక ఉగ్రవాద చర్యగా క్యాబినెట్ పేర్కొందని, ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఘటనపై శీఘ్రగతిన, పూర్తి వృత్తినిబద్ధతతో విచారణకు కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. తద్వారా దాడికి పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిని, స్పాన్సరర్లను గుర్తించి వారిని చట్టం ముందుకు తీసుకురావచ్చని సమావేశం అభిప్రాయపడిందన్నారు. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్టు వెల్లడించారు.
కాగా, ఈ సమావేశానికి ముందు ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశమైంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా సీసీఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఢిల్లీ పేలుళ్ల మృతులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఇవి కూడా చదవండి..
26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర
జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి