Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..
ABN , Publish Date - Feb 01 , 2025 | 01:25 PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై దృష్టి సారించిన మోదీ ప్రభుత్వం.. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది..
Budget Priority for Artificial Intelligence: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌లో కీలక ప్రకటనలు చేశారు. భారతదేశ సాంకేతిక, విద్యా రంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) కోసం రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి AIలో మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక AI పరిశోధనను ప్రోత్సహించడం, విద్యా రంగంలో దాని అనువర్తనాన్ని మెరుగుపరచడం ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్
డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషనల్ సెక్టార్‌లో AI ఆధారిత ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అధునాతన పరిశోధన, AI- ఎనేబుల్డ్ లెర్నింగ్ టూల్స్, పరిశ్రమ-విద్యా సహకారంపై దృష్టి సారించి విద్యార్థులను నైపుణ్యాలతో అభివృద్ధి చెందేలా చేస్తామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలను మారుస్తోందని.. AIలో భారతదేశం అగ్రగామిగా ఉండాలని.. అందుకే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆవిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆటోమేటెడ్ అసెస్‌మెంట్‌లు, AI-ఆధారిత ట్యుటోరియల్ సిస్టమ్‌లతో సహా విద్యాపరమైన అనువర్తనాల కోసం AI నమూనాలను అభివృద్ధి చేయడానికి ఈ కేంద్రాలు ప్రముఖ విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం అవుతాయని తెలిపారు.
గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా..
AI COEతో పాటు, 2014 తర్వాత స్థాపించబడిన ఐదు IITలలో మౌలిక సదుపాయాల విస్తరణను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 6,500 మంది విద్యార్థులకు అదనపు విద్య, హాస్టల్ సౌకర్యాలను కల్పిస్తుందని, తద్వారా భారతదేశ ఇంజనీరింగ్, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఐఐటీ భిలాయ్, ఐఐటీ ధార్వాడ్, ఐఐటీ గోవా, ఐఐటీ జమ్మూ, ఐఐటీ తిరుపతి వంటి ఐఐటీలు ప్రయోజనం పొందుతాయని భారతదేశాన్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా బలోపేతం చేస్తాయని అన్నారు.
అభివృద్ధి చెందిన భారతదేశం
ఈ పెట్టుబడి 2047 నాటికి "అభివృద్ధి చెందిన భారతదేశం" అనే పేరు తెస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు. దీనిలో సాంకేతికత, AI, విద్య, ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పనలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విద్యలో AIపై దృష్టి కేంద్రీకరించడం భారతదేశ జాతీయ AI వ్యూహానికి అనుగుణంగా ఉంది. ఇది AI-ఆధారిత ఆవిష్కరణలలో దేశాన్ని అగ్రగామిగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. భారతదేశంలో AI ప్రతిభను పెంపొందించడానికి, పరిశోధనలను ప్రోత్సహించడానికి మరియు డిజిటల్ విద్య ఫలితాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Also Read: ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. IT శ్లాబ్ పరిమితి పెంపు