Union Budget 2025 : చౌక ధరకే లభించే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవే..
ABN , Publish Date - Feb 01 , 2025 | 01:53 PM
వరసగా 8వసారి బడ్డెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. భారీ ధర ఉన్న ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఇకపై ప్రజలకు చౌక ధరకే లభిస్తాయని ప్రకటించారు..
ప్రస్తుతం దేశమంతటా స్మార్ట్ హవా నడుస్తోంది. సామాన్యుల్లో స్మార్ట్ గ్యాడ్జెట్ల వాడకాన్ని మరింత పెంచేందుకుగానూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరసగా 8వసారి బడ్డెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. టెక్నాలజీ రంగం గురించి బడ్జెట్ సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నట్లు ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకూ భారీగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను అతి చౌకగా అందించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే..
భారీగా ధరలు తగ్గిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్..
2025వ సంవత్సరానికి గాను ఈ రోజు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా సాంకేతిక రంగం గురించి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఉపకరణాలను భారీగా తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి స్మార్ట్ ఫోన్లు, ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలు సరసమైన ధరలకే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. వీటితో పాటు మొబైల్ ఫోన్లలో ఉపయోగించే లిథియం బ్యాటరీలు కూడా చౌక ధరకే లభించబోతున్నాయి. "మేక్ ఇన్ ఇండియా" లో భాగంగా, స్థానిక తయారీని ప్రోత్సహిస్తూ దేశ ప్రజల్లో స్మార్ట్ ఉత్పత్తుల వినియోగాన్నిపెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెలువరించారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సంబంధించిన మరిన్ని తయారీ యూనిట్లను దేశంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీలలో ఉపయోగించే కీలక భాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించినట్లు వెల్లడించారు. ఈ వార్త సామాన్య ప్రజలకు ఊరట కలిగించనుంది. ఈ నిర్ణయం దేశీయ ఉత్పత్తిని పెంచి, గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయగలదని అంతా భావిస్తున్నారు.
డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాలను ప్రమోట్ చేసేందుకు ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. స్థానిక తయారీని మెరుగుపరచడం, సాంకేతిక రంగ ఖర్చులను తగ్గించడం, దేశీయంగా స్మార్ట్ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈసారి బడ్జెట్‌లో ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలలో ఉపయోగించే ఓపెన్ సెల్‌లు, ఇతర భాగాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD)ని 5% తగ్గించారు. దీంతో ఇక నుంచి స్మార్ట్ ఫోన్లు, ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలు ధరలు కింది దిగిరానున్నాయి. వీటితో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ (EV), మొబైల్ ఫోన్ రంగాలకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్‌లో కొన్ని మార్పులను ప్రవేశపెట్టింది. వీటి తయరీలో కీలకమైన లిథియం-అయాన్ బ్యాటరీల చౌక ధరకే అందించేలా నిర్ణయం తీసుకుంది. అయితే, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలపై BCDని 10% నుంచి 20%కి పెంచారు. ఇప్పటికే భారత్ 500 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ లక్ష్యానికి చేరువలో ఉంది. టెక్, గ్రీన్, ఎనర్జీ రంగాలలో ఇండియా ముందుండేలా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.