F-35B Lightning 2: కేరళలో 15 రోజులుగా యూకే యుద్ధ విమానం.. రిపేర్ల కోసం త్వరలో బ్రిటన్ ఇంజినీర్ల రాక
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:16 PM
దాదాపు పదిహేను రోజులుగా భారత్‌లోనే ఉన్న బ్రిటన్ యుద్ధ విమానాన్ని రిపేర్ చేసేందుకు రాయల్ నేవీకి చెందిన ప్రత్యేక నిపుణులు బృందం త్వరలో రానుంది. ఆ తరువాత విమానాన్ని ప్రత్యేక హ్యాంగర్‌కు తరలించి మరమ్మతులు చేపడతారు.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు పదిహేను రోజులుగా తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఉన్న యూకే ఎఫ్-35బీ లైట్నింగ్ -2 యుద్ధ విమానాన్ని రిపేర్ చేసేందుకు బ్రిటన్ నుంచి ప్రత్యేక ఇంజినీర్ల బృందం రానుంది. విమానాన్ని రిపేర్ చేసేందుకు ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ప్రత్యేక టెక్నీషియన్లు, ఇంజినీర్లలతో కూడిన 40 మంది సభ్యుల బృందం త్వరలో రంగంలోకి దిగనుంది. ప్రస్తుతం ఆరుబయట ఉన్న యుద్ధ విమానాన్ని హ్యాంగర్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక టో వెహికిల్‌ను కూడా యూకే నుంచి తెప్పించనున్నారు. అనంతరం, విమానాన్ని మెయిటెనెన్స్ రిపేర్ల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ఎయిర్ ఇండియా హ్యాంగర్‌లోకి తరలించి మరమ్మతులు నిర్వహిస్తారు.
హైడ్రాలిక్ లోపం కారణంగా ఎఫ్-35బీ యుద్ధ విమానం జూన్ 14న కేరళలో అత్యవసరంగా ల్యాండయిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి విమానం వచ్చి 15 రోజులు పూర్తవుతాయి. ఆరు బయట టార్మాక్‌పై ఉన్న ఈ విమానాన్ని హ్యాంగర్‌లోకి చేర్చేందుకు ఎయిర్ ఇండియా ఆఫర్ చేసినా బ్రిటన్ రాయల్ నేవీ తిరస్కరించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇక విమానాన్ని రిపేర్ చేసేందుకు ఇప్పటివరకూ జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈసారి విమానాన్ని ఎలాగైనా బాగుచేయాలన్న పట్టుదలతో యూకే రాయల్ నేవీ.. ప్రత్యేక నిపుణుల బృందాన్ని భారత్‌కు పంపించేందుకు నిర్ణయించింది. భారత్‌లోనే ఈ రిపేర్లు నిర్వహిస్తారు. ఈ క్రమంలో విమానం పార్కింగ్‌కు సంబంధించిన చార్జీలను బ్రిటన్ చెల్లించనుంది.
ఇంతకాలంగా ఓ విదేశీ యుద్ధ విమానం భారత్‌లో నిలిచిపోవడంతో నెట్టింట మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ‘యుద్ధ విమానం అమ్మకానికి వచ్చింది.. ఎవరైనా కొంటారా’ అంటూ ఓఎల్ఎక్స్‌లో పోస్టు పెట్టినట్టు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. 110 మిలియన్ డాలర్ల జెట్‌ను కేవలం 40 మిలియన్ డాలర్‌లకే పొందొచ్చన్న ఆఫర్‌లు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ జెట్‌కు భారత పౌరసత్వం ఇవ్వాలని కొందరు సరదాగా కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్ రిసార్ట్‌లో ఎలుగుబంటి కలకలం
పాక్‌కు కీలక సమాచారం లీక్.. నేవీ ప్రధాన కార్యాలయం ఉద్యోగి అరెస్టు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి