Mumbai High Court: ముంబై వీధులను రేపటిలోగా ఖాళీ చేయండి.. హైకోర్టు హుకుం
ABN , Publish Date - Sep 01 , 2025 | 07:43 PM
నిరసనకారులు షరతులన్నింటినీ ఉల్లంఘించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ఆజాద్ మైదాన్‌లో ఉండటానికి బదులు సౌత్ ముంబైలోని అనేక కీలక ప్రాంతాల్లో గుమిగూడారని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ముంబై: మరాఠాలకు ఓబీసీ కేటగిరిలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై సామాజిక కార్యకర్త మనోజ్ జరాంగే (Manoj Jarange) చేస్తున్న ఉద్యమం తీవ్రమవుతోంది. సిటీలోని రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్‌లతో నిండిపోతున్నాయి. దీనిపై ముంబై హైకోర్టు సోమవారంనాడు అసహనం వ్యక్తం చేసింది. నిరసనలు శాంతియుతంగా జరగడం లేదని, నిబంధనలన్నింటిని ఉల్లంఘిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఈనెల 2వ తేదీలోగా నిరసనకారులు ముంబై వీధులను వీడాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఒక అవకాశం ఇస్తున్నాం
'పరిస్థితి తక్షణం సరిదిద్దుకునే ఒక అవకాశాన్ని జరాంగే, ఆయన మద్దతుదారులకు ఇస్తున్నాం. మంగళవారం మధ్యాహ్నానికల్లా వీధులన్నీ ఖాళీ చేయాలి. రోడ్లన్నీ పరిశుభ్రంగా మారాలి' అని న్యాయమూర్తులు రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖాడ్‌లతో కూడిన స్పెషల్ బెంచ్ స్పష్టం చేసింది.
నిరసనకారులు షరతులన్నింటినీ ఉల్లంఘించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని, ఆజాద్ మైదాన్‌లో ఉండటానికి బదులు సౌత్ ముంబైలోని అనేక కీలక ప్రాంతాల్లో గుమిగూడారని ధర్మాసనం పేర్కొంది. 'ఇది ఎలాంటి శాంతియుత ప్రదర్శన అని మేమనుకోవాలి? హైకోర్టు భవంతిని చుట్టుముట్టారు. న్యాయమూర్తులు, లాయర్ల ఎంట్రీ గేట్లను బ్లాక్ చేశారు. ఇవాళ హైకోర్టు న్యాయమూర్తుల కార్లు కూడా దిగ్బంధంలో ఉన్నాయి. సీటీ మొత్తం బ్లాక్ చేశారు' అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళన కొనసాగించేందుకు జరాంగే పటేల్, ఆయన మద్దతుదారుల వద్ద అవసరమైన అనుమతులు లేవని, చట్టానికి లోబడి మహారాష్ట్ర ప్రభుత్వం తగిన చర్చలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది.
అది బెదిరింపే..
రోడ్లన్నీ ఎక్కడిక్కడే స్తంభించిపోతే ఎందుకు క్లియర్ చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. డిమాండ్ల నెరవేరేంత వరకరూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జరాంగే పటేల్ చెప్పడం కూడా స్పష్టమైన బెదిరింపేనని పేర్కొంది. నిరసనకారులు ఎందుకు ఆజాద్ మైదాన్‌లో కూర్చోవడం లేదని, ఒక చోట నుంచి మరొక చోటకు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించింది. చట్టానికి కట్టుబడి నిరసనలు జరగాలని ఆగస్టు 27న తాము స్పష్టంగా ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తుచేసింది.
ఇవి కూడా చదవండి..
అప్ఘనిస్తాన్‌ను ఆదుకుంటాం.. మోదీ అభయం
షరతులు అతిక్రమిస్తున్నారు.. జారంగే దీక్షపై హైకోర్టు ఆగ్రహం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..