Share News

BJP: 17న ధర్మస్థలకు బీజేపీ ఎమ్మెల్యేలు..

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:23 PM

ధర్మస్థళ పవిత్రతకు భంగం కలిగించేలా కుట్ర సాగుతోందని 17వ తేదీన బీజేపీ ఎమ్మెల్యేలంతా ధర్మస్థళను సందర్శిస్తామని పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర తెలిపారు. బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ మేం బీజేపీ కార్యకర్తలుగా వెళ్లడం లేదని, మంజనాథేశ్వర భక్తులుగా ధర్మస్థళకు వెళ్తున్నామన్నారు.

BJP: 17న ధర్మస్థలకు బీజేపీ ఎమ్మెల్యేలు..

- పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర

బెంగళూరు: ధర్మస్థల పవిత్రతకు భంగం కలిగించేలా కుట్ర సాగుతోందని 17వ తేదీన బీజేపీ ఎమ్మెల్యేలంతా ధర్మస్థల(Dharmasthala)ను సందర్శిస్తామని పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర తెలిపారు. బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ మేం బీజేపీ కార్యకర్తలుగా వెళ్లడం లేదని, మంజనాథేశ్వర భక్తులుగా ధర్మస్థళకు వెళ్తున్నామన్నారు. పార్టీ సీనియర్‌ నేతలు, పరిషత్‌ సభ్యులతో కలసి వెళ్తామన్నారు. ధర్మస్థల దుష్ప్రచారంపై ఎస్‌డీపీఐ కుట్ర ఉందన్నారు. ఆ వివాదానికి సంబంధించి వెళ్లడం లేదన్నారు. సిట్‌ తనిఖీలు వేగవంతంగా ముగించాలని, వాస్తవాలను వెలికితీయాలనేది మా డిమాండ్‌ అన్నారు. గందరగోళానికి బ్రేక్‌ వేయాలనేది మా ఆశయమన్నారు.


- ఇదే అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ మాట్లాడుతూ మళ్లీ గుంతలు తవ్వుతారో తెలియదని, కానీ ఫిర్యాదుదారుడు కోర్టునుంచి ఆదేశాలు పొందారని, ఆ తర్వాతనే సిట్‌ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే పరిగనిస్తోందన్నారు. దర్యాప్తునకు సంబంధించి సిట్‌ మధ్యంతర నివేదిక ఇవ్వడం సాధ్యం కాదన్నారు. దర్యాప్తు పూర్తయ్యాక సీఎం ప్రకటిస్తారన్నారు. బీజేపీ హిందూత్వ ముసుగులో క్రెడిట్‌ సాధించేందుకు ప్రయత్నిస్తోందని, వారు హైకోర్టుకు వెళ్లవచ్చునన్నారు.


మేం కూడా హిందువులమే అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో స్పీకర్‌ యూటీ కాదర్‌ జోక్యం చేసుకుని సిట్‌ దర్యాప్తు చేస్తోందని, సొంత అభిప్రాయాలు అవసరం లేదన్నారు. ఈ అంశంపై సభలో చర్చకు అవకాశం ఇచ్చానన్నారు. మంత్రి దినేశ్‌ గుండూరావు మాట్లాడుతూ ఇప్పటివరకు ఎటువంటి సాక్ష్యం లేకున్నా తీవ్రస్థాయిలో ప్రచారం సాగుతోందన్నారు. ఆ వ్యక్తి ఉద్దేశ్యం ఏమిటో, పరువుకు భంగం కలిగించేలా ఎందుకు వ్యవహరిస్తున్నారో, వారి ఉద్దేశ్యంపైనా దర్యాప్తు జరిపించాలన్నారు. మాజీ డీసీఎం అశ్వత్థనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వానికి సూక్ష్మత లేదన్నారు. తొలుత ఆరేడు పాయింట్‌లు అన్నారని, ప్రస్తుతం 15 ప్రదేశాలలో తవ్వకాలు సాగాయని, ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. పీఎఫ్ఐ వంటి సంస్థల వెనుక రహస్యాన్ని ఛేదించాలన్నారు.


pandu1.2.jpg

- ఈనెల 16న 200 వాహనాలతో యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ ధర్మస్థళకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మస్థళపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 6 గంటలకు సింగనాయకనహళ్ళి నుంచి ధర్మస్థళకు వెళ్తామన్నారు. మంజునాథస్వామి దర్శనం చేసుకుని ఆలయ పవిత్రతకు భంగం కలిగిస్తున్న దుష్టులకు శిక్షించాలని పూజలు చేస్తామన్నారు. మరుసటి రోజు వెనుతిరిగి వస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా పాల్గొనవచ్చునన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాకిస్థాన్‌ బెదిరింపులకు భయపడేది లేదు

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 14 , 2025 | 12:43 PM