Rahul Gandhi On Vote Chori: ఓట్ల చోరీ చేస్తే ఎన్నేళ్లైనా అధికారంలో ఉండొచ్చు.. అమిత్‌షాపై రాహుల్ విసుర్లు
ABN , Publish Date - Aug 26 , 2025 | 09:35 PM
సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే తాను స్టేట్‌మెంట్లు ఇస్తానని రాహుల్ అన్నారు. తాను అబద్ధాలు చెప్పనని, వాస్తవాలు తన ముందు ఉన్నప్పుడే ఆ విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు.
మధుబని: ఓట్ల చోరీ (Vote Chori) ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొనసాగిస్తున్నారు. ఓట్ల చోరీకి పాల్పడితే ఎన్నేళ్లయినా అధికారంలో ఉండొచ్చని తాజాగా ఆయన బీజేపీ (BJP), కేంద్ర మంత్రి అమిత్‌షా (Amit Shah)పై విమర్శలు కురిపించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉంటామని బీజేపీ ప్రకటించుకోవడానికి ఓట్ల చోరీతో సంబంధం ఉందని తాజాగా ఆరోపించారు. తమ పార్టీ 40-50 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని అమిత్‌షా చేసిన వ్యాఖ్యల వెనుక అసలు నిజం బయటపడిందన్నారు. 'ఓటర్ అధికార్ యాత్ర'లో భాగంగా బిహార్‌లోని మధుబనిలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు.
'బీజేపీ ప్రభుత్వం 40-50 ఏళ్లు అధికారంలో ఉంటుందని అమిత్‌షా చాలాసార్లు చెప్పారు. ఇన్నేళ్లు అధికారంలో ఉంటామనే విషయం ఆయనకు ఎలా తెలుసునని ఆలోచించే వాడిని. దీని వెనుక అసలు నిజం ఏమిటో ఈరోజు దేశ ప్రజలకు తెలిసింది. వాళ్లు (బీజేపీ) ఓట్ల చోరీ చేస్తున్నారు. ఇది గుజరాత్‌లో మొదలైంది. ఆ తర్వాత అది 2014లో జాతీయ స్థాయికి తెచ్చారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల వరకూ వచ్చింది' అని రాహుల్ విమర్శించారు.
సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే తాను స్టేట్‌మెంట్లు ఇస్తానని రాహుల్ అన్నారు. తాను అబద్ధాలు చెప్పనని, వాస్తవాలు తన ముందు ఉన్నప్పుడే ఆ విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు. బిహార్ యువకులు పెద్దఎత్తున తమ సత్తా చాటుకున్నప్పుడే బీజేపీ నాయకత్వం, ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీకి ముందు ఒకటి రెండుసార్లు ఆలోచిస్తాయని అన్నారు. దశల వారీగా పౌరుల హక్కులకు కేంద్ర ప్రభుత్వం గండికొడుతోందని.. మొదట ఓటు, ఆ తర్వాత రేషన్ కార్డు, ఆ తర్వాత భూములు... ఇలా పౌరుల హక్కులను ఊడలాక్కుంటోందని, అయితే విపక్షాలు దీనిని ఎంతమాత్రం కొనసాగనీయమని రాహుల్ అన్నారు.
ప్రియాంక నోట కూడా అదే మాట..
ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సైతం ఓట్ల చోరీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మీ జీవనోపాధికి అవసరమైన గేదెలు కూడా చోరీ చేస్తుందని లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఆరోపించారని, కానీ ఇప్పుడు మోదీనే మీ ఓటును చోరీ చేస్తున్నారని ప్రియాంక అన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటింగ్ పునాదని, అది ప్రజలకు విలువైన హక్కు అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాలు, పీఎస్‌యూలను ప్రజల నుంచి దోచుకుందని, ఓట్లు కూడా ఎత్తుకుపోయేందుకు ప్రజలు వెసులుబాటు కలిగిస్తే ఇక ప్రజల ఉనికే ప్రశ్నార్ధకమవుతుందని, ప్రజల హక్కులతో పాటు పౌరసత్వాన్ని కూడా వాళ్లు ఎత్తుకెళ్లిపోతారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
నావికాదళంలోకి ఉదయగిరి, హిమగిరి.. ఇక శత్రువులకు చుక్కలే..
వైష్ణోదేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతి
For More National News