Ahmedabad plane crash: ఎయిరిండియా ప్రమాద ఘటనపై కొత్త వీడియో.. బిల్డింగ్ పై నుంచి దూకేసిన మెడికోలు..
ABN , Publish Date - Jun 17 , 2025 | 02:22 PM
Ahmedabad plane crash video: జూన్ 12న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఘటనకు సంబంధించి కొత్త వీడియో బయటకు వచ్చింది. విమానం ఢీకొన్న వెంటనే కొందరు ప్రాణభయంతో బిల్డింగ్ పై నుంచి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Ahmedabad Plane crash BJ Medical students escape: గతవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘెర విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ దుర్ఘటనకు సంబంధించి కొత్త వీడియో బయటకొచ్చింది. విమానం మెడికల్ కాలేజీ కాంప్లెక్స్‌పై కుప్పకూలిన తరువాత జరిగిన పరిణామాలు అందులో రికార్డయ్యాయి. మండుతున్న హాస్టల్ భవనం, దట్టమైన నల్లటి పొగ నుంచి తప్పించుకోవడానికి బిజె మెడికల్ కాలేజీ విద్యార్థులు పడిన నరకయాతన గగుర్పాటు కలిగిస్తుంది. ప్రాణభయంతో బిల్డింగ్ పై నుంచి మెడికల్ స్టూడెంట్స్ దూకుతున్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
అహ్మదాబాద్‌లో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ మెడికల్ కాలేజీ క్యాంటీన్ పై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 12 మంది సిబ్బంది సహా 241 మంది మరణించగా.. ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. లండన్‌కు వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం కూలిన తరువాత భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. హాస్టల్‌లో విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా బయటకు వచ్చిన కొత్త వీడియోలో క్రాష్ సైట్ నుండి దట్టమైన పొగలు ఎగసిపడుతున్నప్పుడు విద్యార్థులు ప్రాణాలతో బయటపడేందుకు గుడ్డ తాళ్లను ఉపయోగించి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్న దృశ్యాలు నమోదయ్యాయి. మండుతున్న హాస్టల్ భవనం నుంచి తప్పించుకోవడానికి విద్యార్థులు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పై అంతస్తుల నుండి దిగడం వీడియోలో రికార్డయ్యింది. ఎయిర్ ఇండియా విమానం కూలిపోతుండగా నిస్సహాయంగా చూస్తున్న అనేక మంది ప్రజలు సమీపంలోని చెట్లపై కూర్చోవడం కూడా గమనించవచ్చు.
భారతదేశంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా అహ్మదాబాద్ ఘటన నిలిచింది. ఈ దుర్ఘటనలో మొత్తం 274 మంది మరణించారు. విమానంలోని 241 మంది, క్రాష్ జరిగాక 33 మంది ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్‌లో భోంచేస్తున్న ఐదుగురు MBBS విద్యార్థులు మరణించడం మరింత బాధాకరం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్ షురూ
Read Latest Telangana News and National News