Bihar Voters EC Notice: బిహార్‌లో మూడు లక్షల మందికి ఈసీ నోటీసులు..
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:16 PM
ముసాయిదా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బాగంగా బిహార్‌లోని మూడు లక్షల మందికి ఈసీ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. వారి దరఖాస్తుల్లోని వివరాల మధ్య వ్యత్యాసాలను అధికారులకు వచ్చి వివరించాలని ఈసీ ఆదేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ముసాయిదా ఓటర్ జాబితాలో అవకతవకలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బిహార్‌లోని సుమారు మూడు లక్షల మందికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఈసీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో (ఎస్ఐఆర్) భాగంగా ఈ నోటీసులను జారీ చేశారు. నోటీసులు అందుకున్న ఏడు రోజుల లోపు ప్రజలు సంబంధిత ఈసీ అధికారి ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ముసాయిదా ఓటర్ జాబితాలో తమ పేరు చేర్చుకునేందుకు జనాలు సమర్పించిన డాక్యుమెంట్స్‌లో అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
‘ఈ మూడు లక్షల మంది తమంతట తాముగా ముసాయిదా ఓటర్ జాబితాలో పేరును నమోదు చేసుకున్నారు. అయితే, డాక్యుమెంట్స్ తనిఖీల సందర్భంగా కొన్ని అనుమానాస్పద విషయాలు కనిపించాయి. ఈ క్రమంలో ఫీల్డ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించగా అనుమానాలు బలపడ్డాయి. వీరు బంగ్లాదేశ్, మయాన్మార్, నేపాల్ నుంచి వలసొచ్చి ఉండొచ్చనే అనుమానం ఉంది’ అని సంబంధిత అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, మధుబని, కిషన్‌గంజ్, అరేరియా, పూర్నియా, కథీహార్, సుపోల్ జిల్లాల్లోని అనుమానాస్పద ఓటర్లకు ఈ నోటీసులను జారీ చేశారు.
అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ జిల్లాల్లో అక్రమ వలసల అంశం ఎప్పటి నుంచో రాజకీయంగా కాక రేపుతోంది. ఈ ప్రాంతంలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా వలసొచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వాదనలను విపక్షాలు ఖండిస్తున్నాయి. నిత్యం వరద ముప్పు ఎదుర్కునే ఇక్కడి ప్రజలు నిరక్షరాస్యులని, వరదల్లో తమ డాక్యుమెంట్స్‌ను పోగొట్టుకుని ఉండొచ్చని చెబుతున్నాయి.
ఇక ఎస్ఐఆర్ నిబంధనల ప్రకారం, ఈఆర్ఓ/ఏఈఆర్‌ఓ ఆదేశాలు లేకుండా ముసాయిదా జాబితా నుంచి ఏ పేరును తొలగించేందుకు వీలు లేదు. అనుమానిత ఓటర్‌ల పేరును జాబితాలో చేర్చడంపై లిఖిత పూర్వక అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడే ఈసీ అధికారులు సాధారణంగా దర్యాప్తు చేస్తారు. ఈసారి మాత్రం దరఖాస్తుల పరిశీలన దశలోనే పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ముసాయిదా జాబితాలోని వ్యక్తుల పేర్లు, అడ్రస్‌లు, ఇతర వివరాలకు, వారు సమర్పించిన ఆధార్, ఇతర డాక్యుమెంట్స్ వివరాలకు మధ్య వ్యత్యాసాలు కనిపించాయని అన్నారు. ఈసారి 7.24 కోట్ల మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయి. వీటి పరిశీలన జరిగే కొద్దీ మరింత మందికి నోటీసులు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
దేశంలో మహిళలకు అత్యంత భద్రమైన నగరాలు, రిస్క్ ఎక్కువ ఉన్న నగరాలు ఇవే..
జియో, ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఉచిత సేవలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి