Share News

NARI 2025: దేశంలో మహిళలకు అత్యంత భద్రమైన నగరాలు, రిస్క్ ఎక్కువ ఉన్న నగరాలు ఇవే..

ABN , Publish Date - Aug 29 , 2025 | 07:48 AM

దేశంలో మహిళల భద్రతపై విడుదలైన ఎన్ఏఆర్ఐ నివేదికలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలకు ముప్పు ఎక్కువగా ఉన్న నగరాల్లో ఢిల్లీ పట్నాలు ముందు వరుసలో నిలిచాయి. భద్రతమైన నగరాల్లో ఒకటిగా వైజాగ్ గుర్తింపు తెచ్చుకుంది.

NARI 2025: దేశంలో మహిళలకు అత్యంత భద్రమైన నగరాలు, రిస్క్ ఎక్కువ ఉన్న నగరాలు ఇవే..
NARI 2025 Women Safety

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో మహిళల భద్రతపై నిర్వహించిన ఓ సర్వేలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 40 శాతం మంది మహిళలు తమ భద్రతపై ఆందోళనతో ఉన్నట్టు తేలింది. నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ విమెన్ సేఫ్టీ 2025 (ఎన్ఏఆర్ఐ) నివేదికలో ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

గ్రూప్ ఆప్ ఇంటలెక్చువల్స్ అండ్ అకాడమీషియన్స్ (జీఐఏ), పీవాల్వ్ ఎనలిటిక్స్, ది నార్త్‌క్యాప్ యూనివర్సిటీ, జిందాల్ గ్లోబల్ లా స్కూల్ సంయుక్తంగా ఈ నివేదికను తొలిసారిగా విడుదల చేశాయి. అన్ని రాష్ట్రాల్లోని 31 నగరాల్లో సుమారు 12,770 మంది మహిళల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. సంప్రదాయక నేర గణాంకాలకే పరిమితం కాకుండా మహిళల భద్రతకు సంబంధించి లోతైన వివరాలను సేకరించి ఈ నివేదిక రూపొందించారు.

ఈ నివేదిక ప్రకారం, వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కరే ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో, అనేక నేరాలు రికార్డుల్లోకి ఎక్కట్లేదని నివేదికలో పేర్కొన్నారు. మహిళ భద్రత అధికంగా ఉన్న నగరాల్లో కొహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్, ముంబై ముందు వరుసలో ఉన్నాయి. మహిళలు అభద్రతకు గురయ్యే నగరాల్లో రాంచీ, శ్రీనగర్, కోల్‌కతా, ఢిల్లీ, పట్నా ముందు వరుసలో ఉన్నాయి. మౌలిక వసతుల లేమి, ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లిప్తత, పితృస్వామ్య పోకడలు వంటివి ఈ నగరాల్లో మహిళలు అభద్రతా భావానికి గురయ్యేలా చేస్తున్నాయి.


పగటి పూట విద్యా సంస్థల్లో మహిళలకు తాము భద్రంగా ఉన్నామన్న భావన అధికంగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. రాత్రి సమయాల్లో ప్రజారవాణా సాధనాల్లో జర్నీల సందర్భంగా మహిళలు అత్యధికంగా అభద్రతా భావానికి లోనయ్యారు. పర్యాటక స్థలాల్లో కూడా మహిళలు కొంత మేర తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని సర్వే తేల్చింది. మరోవైపు, మహిళలకు అధికార యంత్రాంగంపై నమ్మకం తక్కువగా ఉన్నట్టు కూడా ఈ సర్వేలో తేలింది. తమ ఫిర్యాదుపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని ప్రతి నలుగురు మహిళల్లో ఒక్కరు మాత్రమే విశ్వసిస్తున్నట్టు సర్వేలో తేలింది. ఇక పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థ ఉన్నదీ లేనిదీ తమకు తెలియదని సర్వేలో పాల్గొన్న 53 శాతం మంది చెప్పుకొచ్చారు.

ఈ నివేదికపై జాతీయ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ విజయ రాహత్కార్ స్పందించారు. భద్రత అనేది కేవలం లా అండ్ ఆర్డర్ సమస్య మాత్రమే కాదని మహిళల జీవితాలకు సంబంధించి ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుందన్నది ఈ నివేదిక స్పష్టం చేసిందని అన్నారు. ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి

కశ్మీర్‌లో చొరబాట్లు.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత ఆర్మీ

జియో, ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఉచిత సేవలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 07:58 AM