Jio Airtel Flood Relief: జియో, ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఉచిత సేవలు
ABN , Publish Date - Aug 28 , 2025 | 01:55 PM
వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి ఉచిత డాటా, కాలింగ్ సర్వీసులు అందించేందుకు జియో, ఎయిర్‌టెల్ ముందుకొచ్చాయి. సహాయక చర్యల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరో మూడు రోజుల పాటు ఈ సర్వీసులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారీ వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నివాస ప్రాంతాలన్నీ జలమయం అయిపోవడంతో అనేక మంది అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ సమయంలో సమాచార మార్పిడికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు జియో, ఎయిర్‌టెల్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచిత సేవలు అందించేందుకు నిర్ణయించాయి.
వరద, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని ప్రీపెయిడ్ యూజర్ల రిచార్జ్ ప్లాన్ వ్యాలిడిటీని మరో మూడు రోజుల పాటు పొడిగిస్తున్నట్టు రిలయన్స్ జియో పేర్కొంది. అంతేకాకుండా, రోజుకు 2 జీబీ చొప్పు హైస్పీడ్ డాటా కూడా అందిస్తామని పేర్కొంది. ఈ మూడు రోజుల పాటు కాల్స్ అన్నీ ఉచితమేనని పేర్కొంది. జియో హోమ్ యూజర్లకు కూడా వ్యాలిడిటీని మూడు రోజుల పాటు పొడిగించినట్టు తెలిపింది. ఇక పోస్టు పోయిడ్ యూజుర్లకు కూడా బిల్లు చెల్లింపులు జరిపేందుకు మూడు రోజుల పాటు అదనపు సమయం దక్కింది.
భారతీ ఎయిర్‌టెల్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి అండగా నిలిచింది. ఆయా ప్రాంతాల్లోని ప్రీపెయిడ్ కస్టమర్ల ప్లాన్స్ వ్యాలిడిటీని మూడు రోజుల పాటు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అన్ లిమిటెడ్ కాలింగ్, 1 జీపీ హైస్పీడ్ డాటా కూడా అందిస్తున్నామని చెప్పింది. పోస్టు పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కూడా బిల్లు చెల్లింపులను మూడు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్‌లల్లో సెప్టెంబర్ 2 వరకూ ఇంట్రా సర్కిల్ రోమింగ్‌ను యాక్టివేట్ చేయాలని కేంద్రం ప్రభుత్వం టెలికాం సంస్థలను ఆదేశించింది. కనెక్టివిటీ విషయంలో ఆయా ప్రాంతాల్లోని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో, ప్రజలు తమ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ సేవలు అందుబాటులో లేకపోయినా మరో సంస్థ సర్వీసులను వాడుకోగలుగుతారు. అత్యవసర కాల్స్ చేసేందుకు ప్రజలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి
కశ్మీర్‌లో చొరబాట్లు.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత ఆర్మీ
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్.. స్కూళ్లకు కీలక సూచన
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి