Kashmir Infiltration: కశ్మీర్‌లో చొరబాట్లు.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టిన భారత ఆర్మీ
ABN , Publish Date - Aug 28 , 2025 | 09:41 AM
భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులను భారత్ ఆర్మీ మట్టుపెట్టింది. ఉగ్రవాదులు దాగి ఉండొచ్చనే అనుమానంతో ప్రస్తుతం భద్రతా దళాలు బందిపొరా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్ ఉగ్రవాదులను భద్రతా దళాలు గురువారం మట్టుపెట్టాయి. బందిపొరా జిల్లాలోని గురెజ్ సెక్టర్‌లో నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. నౌషేరా ప్రాంతానికి సమీపంలో సంచరిస్తున్న వారిని మిలిటరీ దళాలు గుర్తించగానే ఫైరింగ్ ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో మరింత మంది ఉగ్రవాదులు దాగి ఉండొచ్చనే అనుమానంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఇక ఈ నెల మొదట్లో భద్రతా దళాలు చేపట్టిన ఉగ్రవాద ఏరివేత చర్యల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమైన విషయం తెలిసిందే. ఆపరేషన్ అఖల్‌లో భాగంగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో టెర్రరిస్టులు హతమయ్యారు. అఖల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు దాగున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇది గమనించిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. భారత దళాలు ప్రతిదాడులకు దిగి ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా అత్యాధునిక నిఘా పరికరాలను వినియోగించామని అధికారులు తెలిపారు. మృతి చెందిన ఉగ్రవాదులు టీఆర్ఎఫ్, ఎల్ఈటీ ఉగ్రసంస్థలకు చెందిన వారని తెలిపారు. పహల్గాం దాడికి తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా కూడా టీఆర్ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్.. స్కూళ్లకు కీలక సూచన
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి