Suspicious Bags at Mumbai: ముంబయిలో బ్యాగుల కలకలం.. భయంతో జనం పరుగులు.. ఏం జరిగిందంటే.?
ABN , Publish Date - Dec 13 , 2025 | 09:28 PM
భారత్‌లో కల్లోలం సృష్టించడానికి ఉగ్రవాదులు, సంఘవిద్రోహులు బాంబు దాడులకు పాల్పడుతున్నారు. టార్గెట్ ఏదైనా.. అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. అదే తరహాలో ముంబయిలోని బాంద్రాలో అనుమానాస్పద రీతిలో రెండు బ్యాగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గత నవంబర్ 10న జరిగిన బాంబు దాడి ఘటనలో 15 మంది చనిపోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ముంబయిలోని బాంద్రాలో 2 బ్యాగులు తీవ్ర కలకలం రేపాయి. అసలేం జరిగిందంటే..
బాంద్రాలోని లింకింగ్ రోడ్‌లో నేషనల్ కాలేజ్ ఎదురుగా రెండు అనుమానాస్పద బ్యాగులు చూసి జనం భయంతో పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న దుకాణదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబ్ స్క్వాడ్‌తో అక్కడకు చేరుకున్నారు పోలీసులు.
ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది దాదాపు 20 నిమిషాల పాటు బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లేవని నిర్ధారించారు. కాగా, ఆ రెండు బ్యాగులు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ జంటకు చెందినవని.. వారు కాఫీ తాగేందుకు వచ్చి తమ బ్యాగులను అక్కడే వదిలేసి వెళ్లినట్లు సమాచారం. మొత్తానికి ఆ బ్యాగుల్లో ఏమీ లేకపోవడంతో పోలీసులు, జనం ఊపిరి పీల్చుకున్నారు. దీంతో అక్కడి పోలీసులు ఎలాంటి ప్రమాదంలేదని చెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు. స్థానికంగా ఉన్న షాపులు తెరిచుకున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు, వాహనాలు కనిపిస్తే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇవీ చదవండి: